ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కుంకుమ పువ్వు సాగుకు భూ కేటాయింపుపై ఆదివాసీల ఆందోళన

47 నిమిషాల క్రితం

girijana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 11:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - చింతపల్లి (అల్లూరి జిల్లా) : కుంకుమ పువ్వు సాగు కోసం 30 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఖండిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ పరిధి చెరువువీధిలో గిరిజనులు ఆదివారం ఆందోళన చేశారు. సాగులో ఉన్న రైతుల అంగీకారం తీసుకోకుండా, గ్రామ పంచాయతీ పీసా కమిటీ తీర్మానం లేకుండా ప్రభుత్వానికి నివేదిక ఎలా పంపుతారని ప్రశ్నిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసీ గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి మాట్లాడుతూ సుమారు 50 ఏళ్లుగా ఐటిడిఎకు చెందిన భూముల్లో 23 ఆదివాసీ కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని, 20 ఎకరాల్లో వివిధ పంటలు, మరో పది ఎకరాల్లో కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నారని, ఈ భూకేటాయింపు వల్ల ఆ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. భూమి కేటాయింపును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలను, సాగుదారుల హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా భూమిని ఇతర అవసరాలకు కేటాయించడం వల్ల రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకూ భూకేటాయింపు ప్రక్రియను నిలిపివేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో పీసా కమిటీ కార్యదర్శులు జి.అప్పారావు, జి.అప్పలస్వామి, ఆదివాసీ గిరిజన సంఘం సభ్యులు జి.చిరంజీవి, రైతులు గుంట గురు, కొర్రా బలరాం, వంతల సోనాదొర, వంతల సైత్, కొర్రా సూరిబాబు, వంతల రాజబాబు, కొర్రా గాసిరాం, సాలెపు సత్యబాబు, వంతల మోహన్, వంతల కృష్ణ, వంతల దున్ను, గుంట ప్రసాద్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్