- ఆరోగ్య హక్కు చట్టం తేవాలి : ఎంవి రమణయ్య
ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంజీవని ఆరోగ్య పథకంతో ప్రజా వైద్యం కార్పొరేట్ పరమయ్యే ప్రమాదం పొంచి ఉందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. విజయనగరం సత్య కళాశాలలో ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యాన ‘సంజీవని ఆరోగ్య పథకం ప్రజారోగ్య వ్యవస్థకు వరమా? శాపమా?’ అనే అంశంపై ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా సంజీవని పథకాన్ని ప్రారంభించి, గొప్ప ఫలితాలు సాధించినట్లు చెప్పుకుంటోందని తెలిపారు. ఇది విఫల ప్రయోగంగా తమ పరిశీలనలో వెల్లడైందని వివరించారు. ఇంటి గడప వద్దకే వైద్యం, 74 పరీక్షలు, ఆన్‌లైన్‌లో మందులు వస్తాయని ప్రభుత్వం చెబుతున్నా.. ఇది అసాధ్యమని నిరూపితమైందన్నారు. ప్రజా వైద్యాన్ని అభివృద్ధి పరచకుండా సంజీవిని పథకాన్ని తీసుకురావడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. వైద్య విభాగం నిధులను సంజీవని పథకానికి దారిమళ్లించడం తగదన్నారు. ప్రజల డేటాను ఆన్‌లైన్ చేసే బాధ్యతను టాటా కంపెనీకి అప్పగించడాన్ని అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రజారోగ్య, వ్యక్తిగత గోప్యతను కాపీ చేసి ఉంచడం పట్ల అర్థం ఏమిటని ప్రశ్నించారు. దాని ఆధారంగా టాటా కంపెనీ మందులు తయారీకా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంజీవని పథకం శాపంగా మారనుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో వారానికి మించి మందులు ఇవ్వలేకపోతున్న పాలకులు.. సంజీవని పేరుతో ఉన్న డబ్బులను ప్రైవేటుపరం చేయడం ఎంతవరకు భావ్యమని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేకుండా చూడాలని, ఆరోగ్య హక్కు చట్టం తేవాలని డిమాండ్ చేశారు. సదస్సులో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)