కత్రినా కైఫ్ ఇటీవల అంబానీ కుటుంబ గణేశ్ చవితి వేడుకలో భర్త విక్కీ కౌశల్‌తో కలిసి కనిపించారు. ప్రసవం తర్వాత ఆమె శరీరాకృతిలో వచ్చిన మార్పులు సామాజిక మాధ్యమాల్లో చర్చకు వచ్చాయి. గత ఫొటోలతో ఇప్పటి ఫొటోలను పోల్చుతూ కొందరు వ్యాఖ్యలు చేయగా, మరికొందరు వ్యక్తిగత దూషణలకు దిగారు. 2025 నవంబరులో కత్రినా తల్లయ్యారు. అయినా కొద్ది నెలల్లోనే ఆమె మునుపటి రూపంలోకి ఎందుకు రాలేదన్న ప్రశ్న సమాజానికి ఎందుకు అంత ముఖ్యమైంది? ఒక మహిళ బిడ్డను కనిన తర్వాత తన శరీరాన్ని ఎవరి కోసం మార్చుకోవాలి? ప్రసవానంతరం ఐశ్వర్యారాయ్ శరీరాకృతిపైనా ఇదే తరహా చర్చ జరిగింది.
ఈ వివాదంపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ స్పందిస్తూ, మహిళల శరీరాలను సమాజం ఎందుకు నిరంతరం బహిరంగ చర్చకు గురిచేస్తోందని ప్రశ్నించారు. పురుషుడికి బట్టతల వచ్చినా, నడుము పెరిగినా, జుట్టు నెరిసినా దాన్ని వయసు, అనుభవం, ఆకర్షణగా చూస్తారని, అదే మార్పులు మహిళలో కనిపిస్తే ఆమె వయసు, రూపం, శరీరంపై ప్రశ్నలు వేస్తారని పేర్కొన్నారు. తాను కూడా బరువు విషయంలో విమర్శలు ఎదుర్కొన్నానని, ఇప్పుడు బరువు తగ్గిన తర్వాత కూడా ఇంజెక్షన్లు వాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. కత్రినా కూడా ఇటీవల అందంపై తన దృక్పథం మారిందని చెప్పారు. ప్రసవం తర్వాత తన చర్మంలో మార్పులు వచ్చాయని, నిర్దిష్టమైన అందం ప్రమాణాన్ని అందుకోవడం కంటే ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండటానికే ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నానని తెలిపారు.
భారతీయ సమాజంలో తెల్లటి రంగును అందానికి, నల్లటి రంగును తక్కువ అందానికి అనుసంధానించే భావజాలం చాలా కాలంగా ఉంది. సినిమా దాన్ని ప్రతిబింబించడమే కాక, అనేక సందర్భాల్లో బలపరిచింది. నందితాదాస్ తన అనుభవాలను చెబుతూ, ధనిక లేదా పట్టణ మహిళ పాత్ర పోషించేటప్పుడు చర్మాన్ని మరింత తెల్లగా చూపించాలని సూచనలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. గ్రామీణ మహిళ పాత్రకు సహజ చర్మరంగం సరిపోతుందని, పట్టణ, విద్యావంతురాలి పాత్రకు తెల్లగా కనిపించాలనే సూచనలోని వివక్షను ఆమె ప్రశ్నించారు. తన్నిష్ఠా ఛటర్జీ కూడా ఇదే తరహా అనుభవాలను ప్రస్తావించారు. నందితాదాస్, స్మితాపాటిల్, షబానా ఆజ్మీ వంటి నటీమణుల ప్రయాణం రూపం ఒక్కటే నటనా ప్రతిభకు ప్రమాణం కాదని చూపించింది. సమస్య వారి రంగులో కాదు; రంగును ప్రతిభకు కొలమానంగా మార్చిన దృష్టిలో ఉంది.
బరువే సమస్యా?
సినీరంగంలో రంగు తర్వాత ఎక్కువ చర్చ శరీరాకృతిపైనే జరుగుతుంది. విద్యాబాలన్ తన బరువు ఒక దశలో ‘‘జాతీయ సమస్య’’గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ‘ది డర్టీ పిక్చర్’, ‘కహానీ’, ‘తుమ్హారీ సులు’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ఆమె తన శరీరాకృతిని మించి నటనకు ప్రాధాన్యం దక్కేలా చేశారు. సోనాక్షి సిన్హా ‘దబాంగ్’ కోసం గణనీయంగా బరువు తగ్గినప్పటికీ, తన శరీరాకృతిపై వ్యాఖ్యలు ఆగలేదని చెప్పారు. హుమా ఖురేషీకి కూడా ప్రధాన స్రవంతి కథానాయికగా కనిపించడానికి బరువు తగ్గాలని వ్యాఖ్యలు వచ్చాయి. మృణాల్ ఠాకూర్ వ్యాయామం చేస్తున్న వీడియోను పంచుకున్నప్పుడు కూడా కొందరు ఆమె శరీరంలోని ఒక భాగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అంటే మహిళా నటికి శరీరం ఎలా ఉన్నా వ్యాఖ్యలు తప్పడం లేదు.
ప్రసవం మహిళ శరీరంపై తీవ్ర శారీరక మార్పులను కలిగించే సహజ ప్రక్రియ. నటి కూడా తల్లి అయ్యాక శారీరక మార్పులు సహజమేనని సమాజం ఎందుకు అంగీకరించదు? స్వరా భాస్కర్ ప్రసవం తర్వాత బరువు పెరగడంపై సామాజిక మాధ్యమాల్లో ఎదురైన వ్యాఖ్యలను ప్రశ్నించారు. ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె శరీరం మారడాన్ని ఎందుకు వార్తగా, విమర్శగా, వ్యక్తిగత వైఫల్యంగా చూడాలని ప్రశ్నించారు. పురుష నటుడు పాత్ర కోసం బరువు పెంచుకుంటే అది అంకితభావంగా, తగ్గితే కష్టపడి సాధించిన శారీరక మార్పుగా ప్రశంసించబడుతుంది. మహిళ సహజంగా బరువు పెరిగితే మాత్రం అందం తగ్గిపోయినట్టు ఎందుకు పరిగణిస్తారు? ఇక్కడ ద్వంద్వ ప్రమాణమే కనిపిస్తోంది.
ద్వంద్వ ప్రమాణాలు
హీరోకు యాభై, అరవై, డెబ్బై ఏళ్లు వచ్చినా అతని వయసును అనుభవంగా, సీనియారిటీగా, కథానాయకుడి పరిణతిగా చూపిస్తారు. హీరోయిన్‌కు మాత్రం ముప్పై దాటిన దగ్గర నుంచే వయసుపై చర్చ మొదలవుతుంది. హీరో తండ్రి పాత్రలో ఉన్నా హీరోగానే కొనసాగవచ్చు. హీరోయిన్ తల్లి పాత్రలోకి వెళ్లినప్పుడు మాత్రం గ్లామర్‌కు అవకాశం తగ్గుతుంది. మహిళ వయసు పెరగడం ఆమె కళకు ముగింపు కాదు. కానీ గ్లామర్‌ను ఒక అమ్మకపు సరుకుగా చూసే దృష్టి ఆమెను చూసే తీరును మార్చుతోంది. సినిమా అనే దృశ్య మాధ్యమంలో మహిళా శరీరాన్ని చూడటానికి ప్రేక్షకుడిని అలవాటు చేసిన విధానమే ఈ సమస్యలో కీలకం. కథతో సంబంధం లేకపోయినా హీరోయిన్ పరిచయాన్ని శరీర భాగాల క్లోజప్‌లతో ప్రారంభించడం, పాటల్లో కెమెరాను మహిళ శరీరంపై నిలపడం, దుస్తులు, నడుము, ఛాతీ, కాళ్లు వంటి శరీర భాగాలను ప్రత్యేకంగా చూపించడం ద్వారా మహిళను ఒక పాత్రగా కాకుండా చూడాల్సిన వస్తువుగా నిర్మించే పద్ధతి కొనసాగుతోంది. నటి తాప్సీ పన్నూ భారతీయ సినిమాల్లో మహిళా శరీరాన్ని కెమెరా ఎలా చూస్తుందన్న విషయంపై బహిరంగంగా మాట్లాడారు. నటిని అలా చూపించడం అలవాటుగా మారితే, ఆమె శరీరంపై వ్యాఖ్యానించడం కూడా సహజమేనన్న భావన ఏర్పడుతుంది.
నటనే గీటురాయి
సినిమా చరిత్ర ఈ సౌందర్య ప్రమాణాలను ఎప్పుడో తిరగరాసింది. రంగు ఆధారంగా విమర్శలు ఎదుర్కొన్న నందితాదాస్ నటిగా, దర్శకురాలిగా తనదైన గుర్తింపు సాధించారు. స్మితాపాటిల్ సాధారణ సౌందర్య ప్రమాణాలను దాటి తన నటనతో భారతీయ సమాంతర సినిమాపై చిరస్మరణీయమైన ముద్ర వేశారు. విద్యాబాలన్ తన బరువు చుట్టూ నిర్మించబడిన చర్చను దాటి కథానాయిక ఎలా ఉండాలి అన్న నిర్వచనాన్నే మార్చారు. సోనాక్షి సిన్హా, హుమా ఖురేషీ కూడా తమ శరీరాకృతిపై వచ్చిన వ్యాఖ్యలకు మించి పాత్రలతో గుర్తింపు పొందారు.
సౌందర్య సాధనాలు అమ్మే కార్పొరేట్ కంపెనీలు, సినిమా పరిశ్రమ ప్రచారం చేసే అందం ప్రమాణాలు, ప్రకటనల్లో చూపించే రూపాలు మహిళలపై నిరంతర ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఇది సెలబ్రిటీలకే పరిమితం కాదు. పాఠశాల విద్యార్థినుల నుంచి ఉద్యోగినుల వరకు తమ శరీరాన్ని ఇతరులతో పోల్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మతమూ, పురుషాధిక్య సమాజమూ ఒకవిధంగా, కార్పొరేట్ ఆధిపత్య మార్కెట్టు మరోవిధంగా మహిళల వ్యక్తిగత పరిధిలోకి చొచ్చుకుపోయి మూస ధోరణులను కొనసాగిస్తున్నాయి. వాటిని వ్యతిరేకించాలి. ఇలాంటి సందర్భాల్లో ఈ ధోరణులకు ఎదురుతిరిగి వినిపిస్తున్న గొంతులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వాటిని స్వాగతించాలి.
- ప్రజాశక్తి సినిమా డెస్క్







కామెంట్‌లు (0)