ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నంద్యాలలో గాలివాన బీభత్సం

55 నిమిషాల క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 12:14 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

• విరిగిన 40 విద్యుత్ స్తంభాలు • నేలకూలిన భారీ వృక్ష‍ాలు

• నెల్లూరులో పిడుగుల వాన • పలు జిల్లాల్లో భారీ వర్షాలు

ప్రజాశక్తి- యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. నంద్యాల జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. చాగలమర్రి మండలంలో 40 విద్యుత్తు ‌స్తంభాలు విరిగిపడ్డాయి. చాగలమర్రిలో 4.4 సెంటీమీటర్లు, ఆత్మకూరులో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్నబోధనం గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దగల సుమారు 200 ఏళ్ల నాటి వేప చెట్టు నేలకూలింది. వట్టిపోయిన వాగులు, వంకలు, వక్కిలేరు, భవనాశి నది జలకళను సంతరించుకున్నాయి. నంద్యాల జిల్లా కేంద్రంలో డ్రెయినేజీలు పొంగిపొర్లి నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లోని నీటికి కాలువలకు మళ్లించే ప్రయత్నం చేశారు. కర్నూలు నగరంలో రెండు గంటలకు పైగా వర్షం కురిసింది. గుత్తి పెట్రోల్‌ బంక్‌ ప్రాంతంలో వర్షపు నీరు రహదారిపై నిలిచిపోయాయి.

నెల్లూరులో పిడుగుల వానతో హడలెత్తిన జనం

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగుల పడ్డాయి. పిడుగులు, ఉరుములతో జిల్లా ప్రజలు వణికిపో యారు. నెల్లూరు నగరంలో పలు వీధుల్లోని రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

తిరుపతిలో నీటమునిగిన కూరగాయల మార్కెట్

తిరుపతి జిల్లాలో శనివారం రాత్రి నుంచి కొన్ని మండలాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. గాలివానకు చెట్లు కొమ్మలు విరిగిపోయాయి. హోల్డింగులు రోడ్లపై పడిపోయాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి నగరంలో సుమారు గంటసేపు భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని అనేక షాపులోకి వర్షం నీరు రావడంతో ఆ షాపుల్లోని వస్తువులు నీట మునిగాయి. ఇందిరా ప్రియదర్శని కూరగాయల మార్కెట్ నడుము లోతు వరకు వర్షం నీరు రావడంతో కూరగాయలు, ఆకుకూరలు కొట్టుకుపోయాయి. మాల్వాడి గుండం కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుమల కొండపై నుంచి వర్షపు నీరు కపిలతీర్థంలో పడడంతో నీటిమట్టం పెరిగింది. తిరుపతి జిల్లాలో తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

అనంతపురం జిల్లాలో విస్తారంగా వర్షాలు

అనంతపురం జిల్లాలో నాలుగు మండలాల్లో మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ వర్షం కురిసింది. యాడికి మండలంలో అత్యధికంగా 97.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో వాగులు, వంకల్లో నీటి సవ్వడి నెలకొంది. బొమ్మనహల్ మండలంలో బోరు బావుల కింద సాగు చేసిన వరి, మొక్కజొన్న, పత్తి, జొన్న పంటలు నీట మునిగి నష్టం వాటిల్లిందని కృష్ణాపురం హనుమంతప్ప, వడ్డే తిమ్మారెడ్డి, రాముడుతో పాటు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలో 70.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్