ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేద రైతులపై దౌర్జన్యం

1 రోజు క్రితం

protese
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:09 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- తమ పొలంలో విద్యుత్‌ ట్రాన్స్‌‌మిషన్‌ లైన్ల ఏర్పాటుకు అంగీకరించని అన్నదాతలు

- వారిని అరెస్టు చేసి పంటలను ధ్వంసం చేసిన అధికారులు

ప్రజాశక్తి-బొమ్మనహాల్ : ప్రైవేట్‌ ‌విద్యుత్తు కంపెనీకి అనుకూలంగా అధికారులు వ్యవహరించి పేద రైతులపై దౌర్జన్యానికి దిగారు. పవర్ గ్రిడ్ కు అనుసంధానంగా నిర్మించ తలపెట్టిన విద్యుత్‌ ట్రాన్స్‌‌మిషన్‌ లైన్ల ఏర్పాటుకు భూములను ఇవ్వడానికి అంగీకరించని వారిపై ప్రతాపం చూపారు. పోలీసులు పలువురిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌‌కు తరలించారు. వారి పంట పొలాలను జెసిబితో అధికారులు ధ్వంసం చేశారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం శ్రీధర్ ఘట్ట రెవెన్యూ పరిధిలో 200 ఎకరాల భూమిని విండ్ పవర్ గ్రిడ్ ఏర్పాటు పేరుతో రిసోనియా అనే ప్రైవేట్‌ కంపెనీకి ప్రభుత్వం కారుచౌకగా గతంలో కట్టబెట్టింది. ఆ కంపెనీ పవర్ గ్రిడ్ కు విద్యుత్తు సరఫరా చేయడానికి పలుచోట్ల ట్రాన్స్‌‌మిషన్‌ ‌లైన్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్‌ ‌స్తంభాల ఏర్పాటు, ఇతర పనులు జరుగుతున్నాయి. తమ జిరాయితీ భూములను ఇవ్వబోమని చెప్తున్న రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ రిసోనియా కంపెనీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అయినా, ఎల్బీనగర్ గ్రామానికి చెందిన పలువురు తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో, కదిరి డిఎస్‌‌పి రవిబాబు ఆధ్వర్యంలో పది మంది ఎస్ఐలు, 20 మంది ఎఎస్ఐలు, 150 మంది పోలీసులు, ఇతర అధికారులు, కంపెనీ ప్రతినిధులు ట్రాన్స్‌‌మిషన్‌ ‌లైన్‌ ఏర్పాటుకు ప్రయత్నించారు. తమ భూములను ఇచ్చేది లేదని అమర్, రామసుబ్బమ్మ, లక్ష్మీదేవి, సుంకన్న (దళితుడు) తదితర రైతులు అభ్యంతరం చెప్పారు. దీంతో, వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి రాయదుర్గం పోలీస్‌ ‌స్టేషన్‌‌కు తరలించారు. వారి పొలాల్లోని మొక్కజొన్న పంటను జెసిబితో అధికారులు ధ్వంసం చేశారు. అరెస్టుకు ముందు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రయివేటు కంపెనీలకు అమ్ముడుపోయి తమ కడుపుకొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఉన్న కొద్దిపాటి భూముల్లో ట్రాన్స్‌‌మిషన్‌ ‌లైన్‌ ఏర్పాటు చేస్తే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. భూములను ఇవ్వాల్సిందేనంటూ రెండు, మూడు నెలల నుంచి అధికారులు తమను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, పలు రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. మండల రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రయివేటు కంపెనీతో కుమ్మక్కయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పొలాలకు ఇవ్వబోమని చెప్పినందుకు నిర్బంధం ప్రయోగించడం అన్యాయమని కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమను ఎంత భయపెట్టినా, కేసులు పెట్టినా భూములను వదులుకోమని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్