సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డేటా సెంటర్లు కాదు..అవి ల్యాండ్‌‌ మైన్స్‌!

20 ఆగస్టు, 2026

viskaha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 10:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ముడసర్లోవ రిజర్వాయర్‌ ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టదా ?

  • విశాఖ వినాశనాన్ని ఆపకుంటే యువతరం తిరగబడడం ఖాయం

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖపట్నం చుట్టూ ‘ల్యాండ్‌ ‌మైన్స్‌’ మాదిరిగా డేటా సెంటర్లు పెట్టి ఈ ప్రాంతాన్ని వినాశనం చేసే టిడిపి కూటమి ప్రభుత్వ తీరును సిపిఎం వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గురువారం విశాఖలోని ముడసర్లోవ రిజర్వాయర్‌ను, సింహాద్రి అప్పన్న కొండపై డేటా సెంటర్‌ ఏర్పాటు ప్రదేశాలను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, మాజీ కార్పొరేటర్‌ ‌డాక్టర్‌ ‌బి.గంగారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌‌కెఎస్‌‌వి.కుమార్‌, పి.మణి, బి.జగన్‌, వి.కృష్ణారావు తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు, ఇప్పటికే ఆరిలోవ ప్రజలు తాగునీరు లేక అల్లాడడం, భవిష్యత్తులో తలెత్తే విద్యుత్‌, పర్యావరణ సమస్యల పట్ల డేటా సెంటర్లపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన రేగుతున్న సమయంలో సిపిఎం బృందం జరిపిన ఈ పర్యటనకు ప్రాధాన్యం లభించింది. అదాని డేటా సెంటర్‌‌కు ఇచ్చిన అప్పన్న కొండ 160 ఎకరాల చుట్టూ భారీ ఎత్తులో పరదాలు చుట్టి రహస్యంగా పనులు చేస్తున్న ప్రభుత్వ తీరును వి.శ్రీనివాసరావు తప్పుబట్టారు. డేటా సెంటర్‌ పనులు జరుగుతున్న చోటుకు వెళ్లకుండా సిపిఎం బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మధురవాడలో 300 ఎకరాలను అదానికి ఇచ్చినా ఇంత వరకూ వినియోగంలోకి తేలేదని గుర్తుచేశారు. ఇప్పుడు మరలా సింహాద్రి అప్పన్న కొండపై 160 ఎకరాలను, తర్లువాడలో డేటా సెంటర్‌‌కు 266 ఎకరాల‌ను, రాంబిల్లిలో 175 ఎకరాలను కేటాయించడం ద్వారా విశాఖపట్నాన్ని అదానిపట్నంగా మారుస్తున్నారని విమర్శించారు. ఈ చర్యలన్నీ విశాఖ చుట్టూ ల్యాండ్‌‌మైన్స్‌ (మందు పాతరలు) పెట్టి ప్రజలకు హాని తలపెట్టేలా ఉన్నాయన్నారు. విశాఖ ప్రజల ఆకాంక్షలను, దాహార్తిని పట్టించుకోకుండా గోదావరి నీటిని అదాని, గూగుల్‌ ‌డేటా సెంటర్లకు కట్టబెట్టడమేమిటని ప్రశ్నించారు.

​అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన మంత్రి లోకేష్‌ ‌

ముడసర్లోవ రిజర్వాయర్‌ ఎండిపోయి ప్రజలకు తాగునీరు లేకపోతే పోలవరం నీటిని డేటా సెంటర్లకు ఇస్తామని అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్‌ చెప్పడం నేరపూరితమైనదని, ప్రజల ఆకాంక్షలకు ఏం విలువ ఇచ్చారని ? శ్రీనివాసరావు ప్రశ్నించారు. నీటికి సంబంధించి అసలు ప్రభుత్వం వద్ద ఉన్న నివేదికలేమిటి ? అని అడిగారు. గోదావరి నీటిని డేటా సెంటర్లకు నేరుగా పైప్‌‌లైన్లతో ఇస్తే మిగతా వారికి ఇవ్వడానికి ఏమీ మిగలవన్నారు. నల్లమల సాగర్‌, బనకచర్ల, రాయలసీమ, ప్రకాశం, గుంటూరు జిల్లాలన్నింటికీ గోదావరి నీటిని పారిస్తామంటూ చంద్రబాబు, లోకేష్‌ మాయమాటలు చెబుతున్నారన్నారు. అసెంబ్లీలో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి ఈ విషయమై అడిగితే ఆమె నోరు నొక్కేస్తున్నారని తెలిపారు. అదాని డేటా సెంటర్‌ ‌ప్రజలను ముంచెయ్యడానికేనని అన్నారు. చంద్రబాబు 3.5 టిఎంసిలు నీరు సరిపోతుందంటే, మంత్రి లోకేష్‌ మూడు ‌టిఎంసిలు సరిపోతుందని చెబుతున్నారని, వారికి ఏమైనా స్పష్టత ఉందా ? అని ఎద్దేవా చేశారు. యూనిట్‌ ‌విద్యుత్‌ను ప్రభుత్వం అదానికి రూపాయికిచ్చి.. అదాని దగ్గరే రూ.10కు కొనుక్కునే విధానం వల్ల ప్రజలకు ఏం లాభమో వారే చెప్పాలన్నారు.

​సింహాద్రి అప్పన్న భూములు కార్పొరేట్ల పాలు

పొద్దున లేచిందగ్గర్నుంచీ ‘దేవుడు.. దేవుడు’ అని జపం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ నాయకులు.. 160 ఎకరాల సింహాద్రి అప్పన్న భూములను కార్పొరేట్లకు ఇచ్చేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పైగా డేటా సెంటర్‌ ‌ప్రాంతాన్ని మీడియాతో చూస్తామంటే అనుమతించకపోవడాన్ని చూస్తే ఇక్కడ ప్రజలకు, విశాఖకు నష్టం చేసే రహస్య పనులు అక్కడ జరుగుతున్నట్టే భావించాల్సి వస్తుందన్నారు. జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లను రద్దుచేయాలని, లేనిపక్షంలో ఢిల్లీ, బీహార్‌, జార్ఖండ్‌ ‌రాష్ర్టాల్లో యువత ఎలాగైతే తిరగబడిందో ఆంధ్రపదేశ్‌‌లోని యువతరమూ అలాగే తిరగబడి ఈ విధానాలను తిప్పికొట్టేరోజు ఎంత దూరమో లేదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్