బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా విఆర్‌ఎల రాయబారం

4 రోజుల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 01:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం

- స్థానిక సంస్థల ఎన్నికల విధులు బహిష్కరిస్తాం : కె ఉమామహేశ్వరరావు

​ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ (గుంటూరు జిల్లా): రాయబారానికి వెళ్లేందుకు విఆర్‌ఎలు ప్రయత్నం ఉద్రిక్తంగా మారింది. తమ న్యాయమైన కోర్కెలు, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి వద్ద నుండి ఎపి సిసిఎల్ కార్యాలయానికి సామూహిక రాయబారానికి గ్రామ రెవెన్యూ సహాయకులు వెళుతుండగా ఎన్ఆర్ఐ ఆస్పత్రి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. సమస్యలపై మాట్లాడుతున్న విఆర్‌ఎల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు చేతిలో ఉన్న మైకును పోలీసులు బలవంతంగా లాక్కోవడంతో ఆయన చేతికి గాయమైంది. శాంతియుతంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తున్న విఆర్‌ఎలపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులకు, విఆర్‌‌ఎలకు తీవ్రవాగ్వాదం జరిగింది. మంగళగిరి జాతీయ రహదారి, ఎన్నారై ఆస్పత్రి వద్ద ఆందోళనకారులు బైఠాయించారు.

​ అనంతరం సమస్యల పరిష్కార చర్చలకై నాయకులను భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి కార్యాలయానికి పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రమోషన్ల సమస్య పరిష్కారించాలని, వన్ టైం సెటిల్మెంట్ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా విధించిన నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, టిఎ, డిఎలు ఇవ్వాలని కోరారు. దీనిపై జయలక్ష్మి స్పందిస్తూ వన్ టైం సెటిల్మెంట్ కోసం అన్ని జిల్లాల కలెక్టర్ల నుండి ఖాళీ పోస్టుల వివరాలు అడిగామని, ప్రమోషన్లకు అర్హులైన విఆర్‌ఎల వివరాలు వెంటనే పంపించాలని ఆదేశాలు జారీ చేశామని, నైట్ డ్యూటీలు రద్దుకు సంబంధించి సబ్ కలెక్టర్లు, ఆర్‌‌డిఒలకు మౌఖిక ఆదేశాలు ఇస్తామని తెలిపారు. పే స్కేలు, జీతాలు చెల్లింపు, నామినీలను విఆర్‌ఎలుగా గుర్తించాలనే సమస్యలపై ప్రభుత్వానికి గతంలోని ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం నుండి ఆమోదం రాగానే అమలుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల ఆకలి బాధలు తీర్చాలని డిమాండ్‌ ‌చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపు సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే స్థానిక ఎన్నికల విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్ మాట్లాడుతూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పూనుకుంటామని తెలిపారు. కార్య్రకమంలో సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి త్రినాధ రావు, రాష్ట్ర నాయకులు కె రవికుమార్, గురుమూర్తి, జ్యోతి, శేఖర్ రెడ్డి, రాజు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్