శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పని పెరిగింది...స్టైపెండ్ ఎందుకు పెంచరు?

1 గంట క్రితం

gvmc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 01:14 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- పలు జిల్లాల్లో జూనియర్‌ వైద్యుల ర్యాలీలు

ప్రజాశక్తి - యంత్రాంగం : స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె శుక్రవారానికి నాలుగో రోజుకు చేరుకుంది. విధుల్లో ఉన్న వైద్యులకు భద్రత పెంచాలని, ఆస్పత్రిలో మౌలిక వసతులు మెరుగుపరిచి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నినదించారు. పని పెరిగింది..ఖర్చులు పెరిగాయి..స్టైఫండ్‌ ఎందుకు పెంచరంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని జూనియర్‌ డాక్టర్లు హెచ్చరించారు.

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జిజిహెచ్) నుంచి రాజ్ విహార్ మీదుగా కలెక్టరేట్ వరకూ జూనియర్‌ డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యులంతా ఏకమై ప్రభుత్వ వైఖరిపై శాంతియుత రీతిలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మెకు ఎపి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు ప్రకటించింది. వైద్యులు అడుగుతున్న డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, తగిన పెంపును మంజూరు చేయాలని ప్రజలు అభిప్రాయపడ్డారు.

గుంటూరులో మోటర్‌ సైకిల్‌ ‌ర్యాలీ నిర్వహించారు. పలు విభాగాలకు చెందిన జూనియర్‌ ‌డాక్టర్లతో పాటు ప్రభుత్వ వైద్యులు కూడా దీక్షలకు హాజరయ్యారు. వైద్య విద్యార్థులు, పిజి రెసిడెంట్లు, వైద్యులు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం నుంచి సమ్మె విరమణకు ఎటువంటి సానుకూల చర్యలు జరగడం లేదని అందువల్ల సమ్మె కొనసాగిస్తామని అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుండి ప్రారంభమైన ర్యాలీ రాంనగర్, నెల్లూరు బస్టాండ్, కలెక్టరేట్ మీదుగా చర్చి సెంటర్ వరకు సాగింది. అనంతరం జూనియర్ వైద్యులు చర్చి సెంటర్‌ లో మానవహారం గా ఏర్పడి నిరసన తెలియజేశారు. సమ్మెకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్ష‍ల సందర్భంగా ఎపి జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆంధ్ర మెడికల్ కాలేజీ విభాగం అధ్యక్షులు దినకర్ సాయి శ్రీనివాస్, డాక్టర్ జైదీర్ బాబు మాట్లాడుతూ.. 15 శాతం స్టైఫండ్ పెంచే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి ఆవరణ నుంచి ఇంటర్న్‌లు, జూనియర్ రెసిడెంట్లు, పిజి వైద్యులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కడప నగరంలో ఫ్లకార్డులతో ర్యాలీ చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్