- నాలుగు దశల్లో నోటిఫికేషన్లు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భర్తీ ప్రక్రియకు నాలుగు దశల్లో నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఈ ఉద్యోగాలను ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతించింది. నాలుగు దశల్లో ఈ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. అవసరాలు, పోస్టుల ప్రాధాన్యత, ప్రజలకు అందించే సేవలు, మౌలిక వసతులు, ఆదాయ సమీకరణ, విద్య, సంక్షేమం, శాంతిభద్రతలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబ్ క్యాలెండర్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
మొదటి దశలో 1,523 పోస్టులకు గత మే నెల్లోనే నోటిఫికేషన్ జారీ చేయగా, రెండో దశలో 3,231 పోస్టులకు సెప్టెంబర్ 15న , మూడో దశలో 2,311 పోస్టులకు 15న, నాలుగో దశలో 2,995 పోస్టులకు కూడా అదే రోజున విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఈ పోస్టులను ఎపిపిఎస్‌సి. ఎపి రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్, డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆయా సంస్థలకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. శాఖలు ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు తదితర సమాచారాన్ని నియామక సంస్థలకు ముందుగానే అందించాల్సి ఉంటుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ - 2025, రిజర్వేషన్ విధానం, సంబంధిత సర్వీస్ రూల్స్, రోస్టర్ నిబంధనల ప్రకారం నియమాకాలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెండో దశలో భర్తీ చేయనున్న పోస్టులు గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్ 11, డిప్యూటీ ఎస్పీ 39 (కమ్యూనికేషన్ 3, సివిల్ 36) పోస్టులు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2 లో 12, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 35, అసిస్టెంట్ కమిషనర్ (స్టేట్ ట్యాక్స్) 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 164, హార్టికల్చర్ ఆఫీసర్ 45, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్లు 40 పోస్టులు ఉన్నాయి. పోలీస్ విభాగంలో పోలీస్ కానిస్టేబుల్ 542, ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ 205, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ 200, డ్రైవర్ కానిస్టేబుల్ 198, సివిల్ ఎస్‌ఐ 182 పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు.
మూడో దశలో ..
మూడో దశలో గ్రూప్–2కు 673 పోస్టులు, ఇంజినీరింగ్ మరియు ఇతర విభాగాల్లో 1,638 పోస్టులు కలిపి మొత్తం 2,311 పోస్టులు ఉన్నాయి. గ్రూప్–2లో డిప్యూటీ ఎండిఓ 176, డిప్యూటీ తహసీల్దార్లు 200, సీనియర్ అకౌంటెంట్లు 90, జూనియర్ అకౌంటెంట్లు 48, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు తదితర పోస్టులు ఉన్నాయి. ఇంజినీరింగ్ పోస్టుల్లో నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు 224, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో 100, రూరల్ వాటర్ సప్లైలో 73, రోడ్లు–భవనాల శాఖలో 79 పోస్టులు ఉన్నాయి. విద్యుత్ శాఖలో ట్రాన్స్కో కి సంబంధించి 200, ఏపీ ఈపీడీసీఎల్ లో 135, ఏపీ ఎస్పీడీసీఎల్ 134, జన్కో లో 100, ఏపీ సిపిడిసిఎల్ లో 60 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి.
నాలుగో దశలో
విద్యా శాఖలో 2,995 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలో ఎస్‌జిటిలు , స్కూల్ అసిస్టెంట్లు, ఇన్‌స్ట్రక్టర్లు, డిఇఓ లు తదితర 2,991 పోస్టులు, అడల్ట్ ఎడ్యుకేషన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 4 పోస్టులు ఉన్నాయి.








కామెంట్‌లు (0)