సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

1 గంట క్రితం

cm cbh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 05:11 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- అంతర్జాతీయ మార్కెట్లకు మన వ్యవసాయ ఉత్పత్తులు

- ఆంధ్రా పాప్ కార్న్, అరకు కాఫీ, కోస్తా కోకో గ్లోబల్ బ్రాండ్లుగా మారాలి

- దేశీయ రకం హైబ్రీడ్ పాప్ కార్న్ మొక్కజొన్న విత్తనాలు విడుదల

- ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

నూజివీడు: మన రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడించే ప్రక్రియను చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పిలుపునిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తులకు విలువ పెరిగి రైతులకు ప్రయోజనం కలిగి సంపద సృష్టికి ఆస్కారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ ఆలోచన అని సీఎం స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ముసునూరు వద్ద గార్మె పాప్ కార్నికా నాన్ జీఎంఓ హైబ్రీడ్ మెయిజ్ విత్తనాలను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గార్మె పాప్ కార్నికా సంస్థ ఏర్పాటు చేసి దేశంలోనే అతిపెద్ద జన్యుమార్పిడి కాని ఎక్ప్ పాండబుల్ పాప్ కార్న్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఉపరాష్ట్రపతితో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..." రైతులపై ఉన్న ప్రేమ, అభిమానంతో ఏలూరు జిల్లాకు వచ్చి రైతులు పండిస్తున్న జన్యుమార్పిడి జరగని మొక్క జొన్న విత్తనాలను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. గార్మె పాప్ కార్న్ సంస్థ భారత నేలపైనే దేశీయంగా జన్యుమార్పిడి జరగని విత్తనాలను రైతులతో కలిసి ఉత్పత్తి చేస్తోంది. మన నూజివీడు గడ్డ నుంచే పండే పాప్ కార్న్ మొక్క జొన్న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతుంది. గార్మె పాప్ కార్న్ దేశంలోనే అతిపెద్ద పాప్ కార్న్ ఉత్పత్తి సంస్థగా అవతరించింది. ఈ సంస్థ ప్రతినిధుల్ని అభినందిస్తున్నాను. 17,500 మంది రైతులతో 40 వేల ఎకరాల్లో ఈ నాన్ జీఎంఓ హైబ్రీడ్ మొక్కజొన్న ఉత్పత్తి చేస్తున్నారు. నూజివీడు సమీపంలోని ముసునూరు వద్ద దేశంలోనే అతిపెద్ద పాప్ కార్న్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయటం సంతోషదాయకం. దేశవ్యాప్తంగా పాప్ కార్న్ ఉత్పత్తిలో 70 శాతం వాటాను కలిగి ఉన్న గార్మె సంస్థకు అభినందనలు. యాంత్రీకరణ, విత్తనాలు, సాగులో సాంకేతికత, రైతుల నుంచి మొక్క జొన్న కొనుగోలు ఇలా అన్నీ వ్యవస్థీకృతంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ మనం కొనుగోలు చేసిన పాప్ కార్న్‌పై పెద్ద ఎత్తున బ్రెజిల్ సహా ఇతర దేశాలకు వెళ్లింది. ఇక నుంచి మన దేశంలోనే ఈ సంపద ఉంటుంది. ఒక్క ఆసియానే కాదు గ్లోబల్ మార్కెట్ కు కూడా మన పాప్ కార్న్ ఎగుమతి కావాలి. ఆంధ్రా పాప్ కార్న్, అరకు కాఫీ తాగేలా రైల్వే స్టేషన్లలోనూ కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతాం. కొండవీటి కొయ్య బొమ్మలు లాంటి స్వదేశీ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు వెళ్లాలి. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఆర్ధిక శక్తిగా, రైతుల్ని ఎంట్రప్రెన్యూర్లుగా చూస్తున్నాం. రైతులు ఉత్పత్తి చేసిన పంటలకు విలువ జోడించి ఎగుమతి చేయాలన్నదే మా లక్ష్యం. పసుపు, మిరప, మొక్క జొన్న, ఆక్వా తదితర ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు చేరాలి. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెస్ చేసి విలువ జోడించి ఓ మంచి బ్రాండ్‌తో అంతర్జాతీయ మార్కెట్లకు తరలిద్దాం. అప్పుడే విలువ పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుంది." అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రాసెసింగ్ పెరిగితేనే ఉత్పత్తులకు విలువ

"ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వాటిలో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్ చేయగలుగుతున్నాం. ప్రాసెసింగ్ పెంచితే అధిక సంపదను ఆర్జించే ఆవకాశం ఉంటుంది. ప్రత్యేకించి యువత ఈ రంగంపై దృష్టి పెట్టాలి. ప్రతి కుటుంబంలో ఓ పారిశ్రామిక వేత్త రావాలి. మన వద్ద ఉత్పత్తి అయ్యే వాటిని గ్లోబల్ ప్రాడెక్ట్సుగా అభివృద్ధి చేయాలి. ఆహారపు అలవాట్ల అనుగుణంగా పంటలు కూడా మారాలి. నూజివీడు వద్ద ఇప్పుడు పామాయిల్, కోకో ఆక్వా లాంటి వాణిజ్య పంటలు పెరిగాయి. వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటల్లో మనం అగ్రగామిగా మారాం. వచ్చే 20-30 ఏళ్లలో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్ధిక వ్యవస్థ ఉండాలో మనం నిర్దేశించు కుందాం. రాయలసీమను కూడా ఉద్యాన పంటల హబ్ గా మార్చేలా కార్యాచరణ చేపట్టాం. రూ.1 లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను అభివృద్ధి చేస్తున్నాం. రూ.35 వేల కోట్లతో 36 సాగు ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తాం. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉన్నా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి పంటలను కాపాడాం. చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంత భవిష్యత్తు కూడా మారుతుంది. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులోనే ప్రారంభించి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాకు నీరు ఇస్తాం. ఎల్ నినో వల్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంది. పప్పు ధాన్యాల లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చర్యలు చేపట్టాం. రైతులు కూడా సహకరించి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తున్నాను. నీటి భద్రత సాధించి ప్రతి ఎకరాకూ నీరు ఇచ్చేలా చర్యలు చేపడతాం. దేశం అంతా నదుల అనుసంధానం జరిగి నీటి సద్వినియోగం జరగాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన. గోదావరి- కృష్ణా, తుంగభద్ర, పెన్నా- కావేరీ నదులను అనుసంధానించటం ద్వారా 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. కష్టకాలంలో అన్ని ప్రాంతాల్లో ఆయకట్టు స్థిరీకరణ, తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. గంగా, మహానది, గోదావరి నదుల్ని కూడా అనుసంధానించుకుంటే వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోగలం. అప్పుడు దేశానికి తిరుగులేదు. నీటి భద్రత సాధిస్తే దేశ అభివృద్ధి అన్ స్టాపబుల్." అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నారాలోకేష్, కె. అచ్చెన్నాయుడు, కొలుసు పార్ధసారధి తదితరులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్