శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడలో న్యాయవాదుల ‘మహా ధర్నా’

01 ఆగస్టు, 2026

Lawyers' ‘Mega Protest’ in Vijayawada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 04:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : న్యాయవృత్తి కూడా ప్రభుత్వ సర్వీసులో భాగమేనని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 వేల మంది న్యాయవాదుల సంక్షేమాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఎఐఎల్‌యు) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఎఐఎల్‌యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పాల్గొని భారీ ఎత్తున 'మహా ధర్నా' నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, న్యాయవాదుల రక్షణపై లాయర్లు నినదించారు.


‘లా నేస్తం’ అటకెక్కించిన కూటమి ప్రభుత్వం : గత ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5,000 చొప్పున 'లా నేస్తం' పథకం ద్వారా ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ. 5,000 కాదు, ఏకంగా నెలకు రూ. 10,000 ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుందని మండిపడ్డారు. గద్దెనెక్కి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ 'లా నేస్తం' పథకాన్ని పూర్తిగా మర్చిపోయి, జూనియర్ లాయర్లను వంచించిందని విమర్శించారు.

01


న్యాయవాదులకు రక్షణ కరవు – అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలి : నేటి సమాజంలో న్యాయవాదులకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేదల తరఫున, బాధితుల పక్షాన నిలబడి కోర్టుల్లో పోరాడే న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. సంఘ విద్రోహ శక్తులతో పాటు రాజకీయ నాయకులు, పోలీసుల నుంచి కూడా న్యాయవాదులకు తీవ్ర ముప్పు పొంచి ఉందన్నారు. కాబట్టి న్యాయవాదుల ప్రాణాలకు, వృత్తికి రక్షణ కల్పించేలా వెంటనే 'న్యాయవాదుల సంరక్షణ చట్టం' తీసుకురావాలని డిమాండ్ చేశారు.


అకాడమీల ఏర్పాటు, ఉచిత ఆరోగ్య సేవలు : కొత్తగా న్యాయవృత్తిలోకి వచ్చే యువ న్యాయవాదులకు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రత్యేకంగా న్యాయ అకాడమీని ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా, రాత్రింబవళ్లు శ్రమిస్తూ కోర్టుల్లో కేసులు వాదించే ప్రతి న్యాయవాదికి, వారి కుటుంబాలకు భద్రత కల్పించేలా ప్రభుత్వమే ఉచిత హెల్త్ కార్డ (ఆరోగ్య కార్డు) సౌకర్యం కల్పించాలని గట్టిగా డిమాండ్ చేశారు.


పోరాటం ఉధృతం చేస్తాం ! : ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో చలనం రావాలని, ఎన్నికల హామీలను నెరవేరుస్తూ న్యాయవాదుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని హెచ్చరించారు. లేనిపక్షంలో 45 వేల మంది న్యాయవాదులను ఏకం చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎఐఎల్‌యు నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్బంగా పలువురు వివిధ జిల్లాల బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఈ ధర్నాకి మద్దతు తెలిపారు. ఈ ధర్నాలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

02


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్