బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు

1 రోజు క్రితం

Veerapandian IAS
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 09:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కోవిడ్‌ కేసులపై నిరంతర నిఘాతోపాటు అనుమానితులకు పరీక్షలు, బాధితులకు తక్షణ చికిత్స అందించేలా ప్రభుత్వాస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్‌ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన అధికారులతో వర్చువల్‌ సమీక్షను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ‌మాట్లాడుతూ.. 17 బోధనాస్పత్రుల్లో 255 ప్రత్యేక కోవిడ్‌ పడకలను సిద్ధం చేసినట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి ద్వితీయ శ్రేణి ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక పడకలు కేటాయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బోధనాస్పత్రుల్లో 6,77,936 ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులు, ఔషధ నిల్వ కేంద్రాల్లో 5.26 లక్షల మాస్కులు, 58,790 ఎన్‌-95 మాస్కులు, 4,436 పిపిఇ కిట్లు, 2,572 శానిటైజర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కోవిడ్‌ చికిత్సకు అవసరమైన యాంటీబయాటిక్స్‌, ఐవి ద్రవాలు, ఇతర అత్యవసర మందుల నిల్వలు కూడా తగిన స్థాయిలో ఉన్నాయన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 51,700 ఆర్‌ఎన్‌ఎ వెలికితీత కిట్లు, 27,552 ఆర్‌‌టిపిసిఆర్‌ కిట్లతో పాటు పిసిఆర్‌ టిప్స్‌, ఫిల్టర్‌ టిప్స్‌, మైక్రో ట్యూబ్స్‌, నైట్రైల్‌ గ్లౌవ్స్‌ కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆర్డర్లు జారీ చేసింది. అదనంగా ప్రతి ఆస్పత్రికి 50 చొప్పున రెమిడిసివిర్‌ ఇంజెక్షన్లు అందించే చర్యలు చేపట్టింది.

26కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య

రాష్ట్రంలో కొత్తగా ఏడు కోవిడ్ కేసులు మంగళవారం నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒక కేసు గుర్తించినట్లు పేర్కొంది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. ఇప్పటి వరకు 145 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఆరు, తూర్పుగోదావరిలో మూడు, కాకినాడ, బాపట్ల జిల్లాల్లో రెండేసి కేసులు వెలుగుచూశాయి. విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఎన్‌‌టిఆర్‌, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదైంది. ప్రస్తుతం పది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ముగ్గురు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్