- గాలికొదిలేసిన గిరిజన సంక్షేమం
- అస్తవ్యస్త నిర్ణయాలు, అసంబద్ధ నియామకాలు
- ఇన్‌ఛార్జి అధికారులతో దిగజారుతున్న ప్రతిష్ట
ప్రజాశక్తి-పార్వతీపురం : పార్వతిపురం మన్యం జిల్లాలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఎ)లో పరిపాలన గాడి తప్పుతోంది. పూర్తిస్థాయి రెగ్యులర్ ప్రాజెక్టు అధికారులు లేకపోవడంతో కిందిస్థాయి అధికారులే కింగ్ మేకర్లుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా ఐటిడిఎలో అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకోవడం, అసంబద్ధ ఉత్తర్వులు జారీ చేయడం వంటి పరిణామాలు తలెత్తుతున్నాయి. ఇన్‌ఛార్జి అధికారులతో ఐటిడిఎ ప్రతిష్ట దిగజారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్దినెలలుగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చోటు చేసుకున్న సంఘటనలు, పరిణామాలు రెగ్యులర్ అధికారులు లేని లోటుకు అద్దం పడుతున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ వైశాలి ప్రస్తుతం ఐటిడిఎ పిఒగా ఉన్నారు. ఆమె రెవెన్యూ వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉండడంతో ఐటిడిఎ పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఎపిఒ మురళీధర్ పాలనా వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఐటిడిఎ పాలనలో ముఖ్య భూమిక పోషించాల్సిన ఎపిఒ మురళీధర్కి గిరిజన సంక్షేమ డిడి అదనపు బాధ్యతలు కట్టబెట్టడంతో దేనికీ న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చోటు చేసుకున్న సంఘటనలు, పరిణామాలు రెగ్యులర్ అధికారులు లేని లోటుకి అద్దం పడుతున్నాయి. కొద్దినెలల క్రితం పార్వతీపురం పట్టణం బైపాస్ రోడ్డులో ఉన్న గిరిజన సంక్షేమ పోస్టుమెట్రిక్ బాలుర హాస్టల్ వార్డెన్ కృష్ణమోహన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. మెనూ సక్రమంగా అమలు కావడం లేదని గిరిజన విద్యార్థులు రాష్ట్ర ఫుడ్ కమిషన్‌కి ఫిర్యాదు చేయడంతో విచారించి వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. తర్వాత ఆయనని గుమ్మలక్ష్మీపురం మండలంలోని కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వార్డెన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వార్డెన్ కృష్ణమోహన్‌ని మళ్లీ పార్వతీపురం గిరిజన సంక్షేమ పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌కి వార్డెన్‌గా నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగిని మళ్లీ అదే చోట నియమించడానికి అధికారులు ప్రయత్నించడం వెనుక దండిగా ముడుపులు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పాచిపెంట మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఎస్జిటిని తదుపరి శిక్షణ కోసం పాఠశాల హెచ్ఎం ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రిలీవ్ చేయడం వివాదాస్పదమవుతోంది. ఈ వ్యవహారంలో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఐటిడిఎ పిఒ వైశాలి ఆదేశించినట్లు సమాచారం. రెండు నెలల క్రితం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ళలో నియామకమైన పది మంది వర్కర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆ పదిమంది వర్కర్ల జీతాల బిల్లు పెట్టడానికి అధికారులు ప్రయత్నిస్తుంటే ఆన్లైన్లో వేరొకరి పేర్లు కనిపించడం వివాదాస్పదమవుతోంది. ఆశ్రమ పాఠశాలల్లో వర్కర్ల నియామకానికి సంబంధించిన థర్డ్ పార్టీ ఏజెన్సీ నిర్వాహకుడు ఈ వ్యవహారంలో కిరికిరి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పది మంది వర్కర్లు ఐటిడిఎ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండు నెలలుగా పని చేస్తున్న తమ పేర్లు ఆన్లైన్లో కనిపించకుండా ఇంకొకరి పేర్లు కనిపించడమేమిటని వారు లబోదిబోమంటున్నారు.
గిరిజన సంక్షేమం గాలికి
ఐటిడిఎలో గిరిజన సంక్షేమం గాలికొదిలేసినట్లు కనిపిస్తోంది. ఎనిమిది గిరిజన మండలాలలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థుల సంక్షేమం గాలిలో దీపంలా తయారైంది. కొద్దినెలల వ్యవధిలోనే ఇద్దరు గిరిజన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం సంచలనానికి దారితీసింది. కొద్దినెలల క్రితం మక్కువ మండలంలోని అనసభద్ర ఏకలవ్య మోడల్ పాఠశాలలో సవర అర్పిత్ అనే ఏడో తరగతి విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది మరువకముందే సోమవారం గుమ్మలక్ష్మీపురం మండలంలోని పి.ఆమిటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఏడోతరగతి విద్యార్ధిని బిడ్డిక భానుశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు కురుపాం ఏకలవ్య మోడల్ స్కూల్లో గిరిజన విద్యార్థినులు గర్బం దాల్చిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. గిరిజన సంక్షేమ అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం, మొక్కుబడి సందర్శనలు చేయడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పక్కదారి పడుతున్నాయి. వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించేవిధంగా కౌన్సిలింగ్ నిర్వహించకపోవడంతో బలవన్మరణాలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.







కామెంట్లు (0)