- పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల
ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి :
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, దేశంలో ఉల్లి దిగుబడి తగ్గడం వల్ల ధరలు పెరిగాయని, ఈ నేపథ్యంలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా ప్రభుత్వం రాయితీపై ఉల్లిపాయలు పంపిణీ చేస్తోందని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని ఎపిఐఐసి కాలనీ రైతు బజార్‌లో రాయితీ ధరపై ఉల్లిపాయల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న ఉల్లిపాయల ధరల నుండి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ. 60 నుండి రూ.75 వరకు పలుకుతున్న ఉల్లిపాయలను... సామాన్యుల ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం కేవలం రూ.35కే అందిస్తోందన్నారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకు గరిష్ఠంగా రెండు కిలోల ఉల్లిపాయలను సబ్సిడీ ధరకు పంపిణీ చేస్తామన్నారు. రాయితీపై ఉల్లిపాయలు పొందాలనుకునే వినియోగదారులు కౌంటర్ వద్ద తమ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని తెలిపారు. తొలి విడతగా విజయవాడలోని అన్ని రైతు బజార్లలో ఈ కౌంటర్లను ప్రారంభించామన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి విక్రయాలను విస్తరించనున్నట్లు తెలిపారు.









కామెంట్‌లు (0)