సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పిల్లలు ఆడిన వీధి నాటకం

23 గంటల క్రితం

పిల్లలు ఆడిన వీధి నాటకం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 04:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

విజయవాడ ప్రజా ఉద్యమాల్లో వీధి నాటిక ఓ అంతర్భాగం. అలాంటి వీధి నాటిక ప్రక్రియను చిన్నప్పటి నుండే పిల్లలకు అలవాటు చేయాలనే సంకల్పంతో ‘జాఘవా సాంస్కృతిక వేదిక’ నడుం కట్టింది. దశమ వార్షికోత్సవాల్లో భాగంగా స్థానిక బిషప్‌ అజరయ్య బాలికల పాఠశాల ఈ వీధి నాటికోత్సవాలకు (సెప్టెంబర్ 28వ తేదీ) వేదికయింది. దాదాపు వేయిమంది బాలలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నాలుగు పాఠశాలల వారు నాలుగు భిన్న నాటికలు ప్రదర్శించారు.

​

1. గంగ (నృత్యనాటిక) - కె.ఆర్‌.ఆర్‌. పాఠశాల, చిలువూరు

​పంచభూతాలలో ఒకటైన నీటికి కాలుష్య ముప్పు వాటిల్లే వైనాన్ని ఈ నాటిక కళ్లకు కట్టింది. ధనార్జన కోసం కార్పొరేట్‌ శక్తులు, కాలుష్య రాక్షసులుగా మారి మానవాళి వినాశనానికి కారకులవుతున్న వైనాన్ని అలతి అలతి పదాలతో, యక్షగాన రగడలతో వివరిస్తారు. పంచభూతాల పరస్పర ఆధారితాలు, పరస్పర ప్రేరితాలు. ఒకటి లేకుండా ఒకటి మనజాలవు. అందమైన ప్రకృతి పర్యావరణ ఆవరణంలో మనం జీవిస్తున్నాం. మనం మన ప్రకృతిని కాపాడుకోకుంటే కొరివితో తల గోక్కున్నట్టే. ఇంత ప్రమాదకరమైన విషయాన్ని రచయిత రౌతు వాసుదేవరావు నాటకీయ శైలిలో గేయంగా రచించారు. నిస్సహాయులైన ప్రేక్షకులకు గంగామాత, చెట్లు తమ ఇక్కట్లను తెలుపుతూనే హితబోధ చేస్తాయి. దుర్మార్గులపై తిరగబడాలని చెబుతాయి. పిల్లలు సామాన్యుల వేషంలో అలా కాలుష్య రాక్షసులపై తిరగబడటం వారికి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది.


​2. చచ్చినా సరే (మేం భారతీయులం) - జి.ఎస్.ఆర్. హైస్కూలు (ఉప్పలపాటి రామచంద్రరావు)

​ప్రభుత్వ గమ్యం తెలియని బాలల కోసం రాసిన గమ్మత్తైన నాటిక. రంగభూమి యమలోకం. యముడు, చిత్రగుప్తుడు, యమభటులు ఉంటారు. బలవంతమైన సర్పం - చలిచీమలు కలిసి చనిపోయి యమలోకానికి వస్తాయి. అలాగే ఇటుక కాంట్రాక్టరు - బాల కార్మికులు ప్రమాదంలో చనిపోయి యమలోకానికి వస్తారు. ‘చీమలు పెట్టిన పుట్టను పాములు ఆక్రమించడం అనాదిగా వస్తున్నదే. ఆధునిక కాలంలో బిల్డింగులు కట్టాలంటే ఇటుకలు కావాల్సిందే. ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతే మా తప్పు ఎలా అవుతుంది?’ అని కాంట్రాక్టరు ప్రశ్నిస్తాడు. యముడికి ఆ అహంకారం నచ్చదు. ‘ప్రకృతి జీవి నుండి ఎదగలేదు గనుక పాముకు శిక్ష వేయలేం. మన కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైన కాంట్రాక్టర్‌ను బతికినంతకాలం ఏ ఆధారం లేని వలస కార్మికునిగా జీవించు’ అని తీర్పు ప్రకటిస్తారు. ఇక్కడే నాటిక మలుపు తిరుగుతుంది. అసోంలోని ఓ వలస కార్మికుడు దళాల్‌ ఈ దేశ పౌరుడివి కావంటూ ఆయన అంత్యక్రియలకు జరిగిన ఘోర పరిస్థితిని తెలుపుతాడు. అప్పుడు రాజ్యాంగం ఏం చెబుతుంది అని ప్రశ్నిస్తే బాలలు రాజ్యాంగ పీఠికను చదువుతారు. ప్రజలందరికీ జీవించడానికి సమాన హక్కులు ఉన్నాయని తెలుస్తాయి. మాకు మా దేశం బహిరంగ జైలు కాకూడదు. మేం భారతీయులం చచ్చినా సరే- అన్న ప్రకటనతో ముగుస్తుంది. పౌరసత్వ సవరణ చట్టం నాటి పరిణామాలు జ్ఞప్తికి వస్తాయి. నాటిక ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.

​

3. యాదమ్మ కథ - (ఫ్యూచర్ పాత్ స్కూల్)

​అట్టడుగున ఉండే అసంఘటిత కార్మికుల జీవన కథ. కంకర కొట్టే పేద కుటుంబంలో యాదమ్మ ఓ 13 ఏళ్ల బాలిక. తండ్రి తాగుబోతు. అమ్మానాన్న ఇద్దరూ కష్టపడుతున్నా, ‘నాన్నా, నువ్వెందుకు తాగుతావ్‌? అమ్మలు తాగరు ఎందుకని?’ ప్రశ్నిస్తుంది. కూలి - కమిషన్‌లో దాగి ఉన్న దోపిడీ మర్మాన్ని వివరిస్తుంది. అందుకే యాదమ్మ లాంటి పిల్లలు చదువుకుంటే మొత్తం ఆ కుటుంబానికే కాదు, ఆ సమూహానికే ఉపయోగపడతారని వాలంటీర్‌ చెబుతుంది. మరో కుటుంబంలో తాగుబోతు తండ్రిని భరించలేక పిల్లలే తన్ని బుద్ధి చెబుతారు. తాగడం వల్ల ఆరోగ్యాలకే హానికరం కాకుండా మొత్తం పేద సమాజానికి ఎంత నష్టమో నాటిక విశదీకరిస్తుంది. జీవన సౌందర్యానికి చదువు పూలబాట పరుస్తుందని ఆహ్లాదంగా వ్యక్తం చేస్తుంది.

​

4. భారతమ్మ ఎక్కడ? (బిషప్‌ అజరయ్య బాలికల పాఠశాల)

​భారతమాతను పూజించడం కాదు. భారతమాత సమాజంలో ఎక్కడ, ఎలా ఉందో నిశితంగా పరిశీలించాలని వెన్ను చరిచి మరీ నాటిక చాటుతుంది. పనిపిల్లగా, పశువుల కాపరిగా, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ కార్మికురాలిగా, జోగినిగా, అత్యాచారానికి గురైన పిచ్చితల్లిగా, అడుక్కునే అనాథగా, కడుపులోనే ఉన్న శిశువుగా... ఇలా తమ బాధలు, జీవితాలు రేఖామాత్రంగా దృశ్యమానం అవుతాయి. ఇలాంటి భారతమ్మలు విరబూయకుండానే నేలరాలిపోతున్నాయి అంటూ కరుణరసంలో వర్ణిస్తాయి. ఈ కుసుమాలు విరబూయనంతవరకు భారతమ్మ ఉనికి పెద్ద ప్రశ్న అంటూ ఆలోచనలో పడేస్తారు రచయితలు దేవేంద్ర, శాంతారావు.

​

ఈ నాలుగు నాటికల ద్వారా పిల్లలు తమ జీవితాల్లో తాము తొంగిచూసుకోవడమే కాకుండా ప్రపంచాన్ని తమదైన కోణంలో చూడటం నేర్చుకుంటారు. అభినయం ద్వారా, భాషా నైపుణ్యాలతో పాటు సామాజిక జీవన నైపుణ్యాలు తెలుసుకుని సాధనలో పెడతారు. ఇవన్నీ తమ వ్యక్తిత్వ నిర్మాణానికి అద్భుతంగా దోహదపడ్డాయి. ఆత్మస్థైర్యాన్ని సాధిస్తారు. దాదాపు వందమంది (బాలికలు అధికంగా) ఈ వీధి నాటకోత్సవంలో పాల్గొనడం ఎంతైనా అభినందనీయం. ఆకర్షణీయమైన దుస్తులు, అలంకరణలతో రికార్డు డ్యాన్స్‌లకు అలవాటు పడుతున్న ఈ దేశంలో సహజసిద్ధమైన సామాజిక పాత్రల్లో నటించడానికి ముందుకు రావడం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం ప్రోత్సహించడం, వారి ఆహార్యం (మేకప్‌) వారే రూపొందించుకోవడం, పాటలు తమకు తామే పాడుకోవడం... ఇది కదా చదువు - ఇది కదా నటన, ఇదికదా నిజమైన బాలల రంగస్థలం అనే భావనను కలగించింది. వీధి నాటికంటే తెలుసు కదా- పట్టపగలు, నడివీధుల్లోనైనా మైక్‌, లైటింగ్‌ లేకపోయినా, రణగొణధ్వనులు దాటుకుని ప్రదర్శనలకు సిద్ధపడాలి కళాకారులు. ఆ నిజాయితీ, నిష్కల్మషత, పట్టుదల, నిర్మలత్వం ఈ బాలల ప్రదర్శనల్లో కనపడటం అందరినీ ఉత్తేజితుల్ని చేసింది.

​- కె.శాంతారావు

99597 45723

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్