గుంటూరు : ప్రఖ్యాత నాటక రచయిత సినిమా రంగ స్థల దర్శకులు, సినీనటులు అభ్యుదయ సాహితీవేత్త వైఎస్.కృష్ణేశ్వరరావు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మరణించారు. గత యేడాదిగా శ్వాసకోశ, గుండె సంబంధిత అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన కృష్ణేశ్వరరావు గుంటూరు ఎ.టి. అగ్రహారంలోని తన ఇంటిలో తుది శ్వాస విడిచారు. కృష్ణేశ్వరావు పూర్తి పేరు యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరుపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు గొప్ప అభ్యుదయవాది అని.. ఆయన సాహిత్య సేవలను స్మరించుకుంటూ సాహిత్య కళాకారులు, రచయితలు, సినీనటులు ఆయనకు నివాళి అర్సిస్తున్నారు.
వైఎస్ కృష్ణేశ్వరరావు తెలుగు నాటక రంగ ప్రముఖులు, రచయిత, సినీ నటులు. ఆయన రంగస్థలంలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించి, పలు నాటకాలను ప్రదర్శించారు. అంతేకాకుండా అనేక తెలుగు సినిమాలకు మాటలు (డైలాగ్స్) రాశారు. వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. పాఠశాల రోజుల నుంచే కళాకారుడిగా ఆయన రంగస్థల ప్రవేశం చేశారు. ఆయన తొలి నాటకం 'వాపస్'. 'రోజు చస్తున్న మనిషి' నాటకం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. నాటక రంగంపై ఉన్న అంకితభావంతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఎం.ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో 'ప్రచండ భారతం' సినిమాకు తొలిసారి మాటలు రాసి సినీ ప్రస్థానం చేశారు. అంకురం, భద్రాచలం, శ్రీరాములయ్య, జయం మనదేరా, నేను సైతం వంటి పలు చిత్రాలకు పనిచేశారు. శ్రీ మహాలక్ష్మి చిత్రానికి సంభాషణలు అందించారు. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను, తదితర చిత్రాలలో నటించారు.
నాటకరంగంలో పలు ప్రయోగాలకు నాంది పలికారు కృష్ణేశ్వరరావు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ పరిషత్ నాటక పోటీలు జరిగినా ఆయన రాసిన, నటించిన నాటకాలు ప్రదర్శితమౌతుండేవి. ఆయన నాటకం పోటీలో ఉందంటే దానికే అవార్డులు అత్యధిక శాతం దక్కేవి. 'సంపద, రోజూ చస్తున్న మనిషి, పక్కింట్లో పుట్టండి, గుర్తు తెలియని శవం' వంటి నాటకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. పొన్నూరు కళాపరిషత్ వ్యవస్థాపకులైన కృష్ణేశ్వరరావు నట, దర్శక, ప్రయోక్తగా ప్రయోగాత్మక నాటకాలతో పలు నంది అవార్డులు గెలుచుకున్నారు. పొన్నూరులో ఆర్.ఎం.పి. డాక్టర్ గా సేవలు అందిస్తూ సొంతంగా నాటకాలు రాసి, దర్శకత్వం వహించిన ఆయన ప్రజల నుంచి జేజేలు అందుకున్నారు. చివరి నిమిషం వరకూ నాటకమే శ్వాసగా బతికారు. సీనియర్ నటుడు ఎం. ప్రభాకర్ రెడ్డి... కృష్ణేశ్వరరావు నాటకం చూసి, 'ప్రచండ భారతం' సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమాకు కథ కృష్ణేశ్వరరావే అందించారు. ఆ తర్వాత మోహన్ బాబు కోరిక మేరకు 'శ్రీరాములయ్య' జీవితాన్ని పరిశోధించి, సినిమాటిక్ గా మార్చారు. 'పరశురామ్, జయం మనదేరా' చిత్రాలకు సంభాషణలు రాశారు. అలానే ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన 'భద్రాచలం'లోనూ నటించారు. నటుడు జీవా ద్వారా దర్శకుడు వంశీ పరిచయం కావడంతో ఆయన తెరకెక్కించిన 'ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను, గోపి గోపిక గోదావరి' వంటి చిత్రాలలో యాక్ట్ చేశారు. 'చందమామ కథలు' సినిమాలో ఆయన పోషించిన పిచ్చివాడి పాత్ర గొప్ప పేరు తెచ్చిపెట్టింది. అలానే 'ఇడియట్, వీర తెలంగాణ, నాంది, విరూపాక్ష' తదితర చిత్రాలలోనూ కృష్ణేశ్వరరావు నటించారు.








కామెంట్‌లు (0)