మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరువుపై మీనమేషాలా?

54 నిమిషాల క్రితం

drought
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఇంకో వారం రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ‌ముగుస్తుండగా కరువు గుర్తింపునకు టిడిపి కూటమి ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కించడం అన్యాయం. దుర్భిక్షం తీవ్రత అంతకంతకూ ఎక్కువవుతున్న నేపథ్యంలో కరువు సహాయక చర్యల కోసం ప్రతిపక్షాలు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టాక, ఇప్పుడు తీరిగ్గా అక్టోబర్‌ 1‌న కరువు మండలాలు ప్రకటించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటి దాకా ఎల్‌‌నినో ప్రభావంపై మొక్కుబడి సమీక్షలకే ప్రభుత్వం పరిమితమైంది మినహా నిర్దిష్టమైన కార్యాచరణ, నిధుల కేటాయింపు చేయకపోవడంతో అధికారులూ అంతే మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం ఎల్‌‌నినో వలన రుతుపవనాలు విఫలమవుతాయని, వర్షాభావం నెలకొంటుందని వాతావరణ శాఖ తొలకరి కంటే ఎంతో ముందుగానే హెచ్చరించింది. ఎల్‌‌నినో ప్రభావం ఏడాదంతా కొనసాగుతుందని, ఇంకా ఇంకా ఉధృతమవుతుందని, అందుకు తగ్గట్టు ప్రభుత్వాలు సన్నద్ధం కావాలని ఐక్యరాజ్య సమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ ఒకటికి రెండు మార్లు అప్రమత్తం చేసింది. ఈ హెచ్చరికను అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం లైట్‌ ‌తీస్కుని ప్రజలను గాలికొదిలిశాయి. ఉపద్రవం ముంచుకొచ్చాక సన్నాహక చర్యలంటూ సన్నాయి నొక్కులు నొక్కడం అభ్యంతరకరం. నైరుతి రుతుపవనాలు రాజస్థాన్‌ ‌నుంచి తిరోగమన దిశ పట్టాయన్న ఐఎండి, ఈ కాలంలో సగటున 15 శాతం లోటు వర్షపాతం నమోదైందని పేర్కొంది. దక్షిణ ద్వీపకల్పంలో ఏకంగా 29 శాతం తక్కువ వర్షం పడిందని విశ్లేషించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌‌లో వర్షపు లోటు 50-55 శాతం ఉంది. దేశంలోకెల్ల మన రాష్ట్రంలోనే కనిష్ట వర్షపాతం నమోదైంది. పరిస్థితి ఇంత దుర్భరంగా ఉన్నా కూటమి ప్రభుత్వంలో స్పందన పేలవంగా ఉంది.

సీజన్‌ ‌మొత్తమ్మీద ఒక్కటంటే ఒక్క జిల్లా కూడా సాధారణ వర్షానికి నోచుకోకపోవడం గడచిన మూడు దశాబ్దాల్లో నెలకొన్న అసాధారణ విపత్తు. రాష్ట్రంలో 688 మండలాలుంటే 624 మండలాల్లో తక్కువ వర్షం పడటం అరుదైన సందర్భం కాగా 399 మండలాల్లో తక్కువ, మరో 224 మండలాల్లో అత్యల్ప వర్షం పడింది. ఒక నెలలో కాకపోతే తదుపరి నెలలోనైనా చినుకు పడుతుందన్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాభావం తీవ్రంగా ఉంది. ఖరీఫ్‌ ‌సాధారణ సాగు 77 లక్షల ఎకరాలు కాగా ప్రభుత్వం 55 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని చెబుతోంది. ఏతావాతా పాతిక లక్షల ఎకరాల్లో విత్తు పడక బీడు పడటం అనివార్యంగా కనిపిస్తోంది. సాగయ్యాయన్న పంటల్లో నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతలు, డ్రైస్పెల్స్‌, భూగర్భ జలాలు లోతులు చూడటం, విద్యుత్‌ ‌కోతల కారణంగా 50 శాతమే, అదీ అతి కష్టం మీద చేతికొచ్చే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ఒక్క గోదావరి డెల్టా తప్ప రాష్ట్రంలో మరెక్కడా పంటలకు గ్యారంటీ లేదు. శ్రీశైలంలో తెలంగాణ, ఎ.పి పోటాపోటీ జల విద్యుదుత్పత్తి వలన రాయలసీమ, ఇతర ప్రాంతాలకు కనీసంగా తాగు, సాగునీటికి సమస్య ఏర్పడింది. నీటి పంపకాల పంచాయితీపై కేంద్రం తమాషా చూస్తోంది.

కరువును ఆపలేకపోయినా బహుముఖంగా ప్రణాళికబద్ధంగా ముందస్తు చర్యలతో సమర్ధవంతంగా ఎదుర్కొని నష్టాలను తగ్గించడం ప్రభుత్వ బాధ్యత. వేసిన పంటలను కాపాడటం, ఖాళీగా ఉన్న భూముల్లో ఏదోఒక పంటను చేయించడం చేయాలి. అందుకు రైతులకు విత్తనాలు, పెట్టుబడులు సమకూర్చాలి. ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించట్లేదు సరికదా జలహారతులంటూ ప్రచారార్భాటాలకు పోతోంది. ఈ చర్యలు కరువును తక్కువ చేస్తాయి. పంటలు నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వడంతోపాటు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి ఆదుకోవాలి. రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్‌ చేయాలి. పశువులకు తాగునీరు, గ్రాసం అందుబాటులో ఉంచాలి. వ్యవసాయ కార్మికులకు అదనంగా పనులు చూపించి వలసలను నివారించాలి. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో వలసలతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. అలాగే నిత్యావసరాల ధరలకు కళ్లెం వేయాలి. దేశంలోకెల్ల రాష్ట్రంలోనే కరువు తీవ్రంగా ఉన్నందున కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. డబుల్‌ ఇంజిన్‌ ‌సర్కార్‌‌గా చెప్పుకుంటున్న మోడీ, ఇతోధికంగా రాష్ట్రానికి కరువు సహాయం అందించాలి. అందుకోసం టిడిపి కూటమి ప్రభుత్వం, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి చేయాలి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్