సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిన్నారుల్లో స్క్రీన్ వ్యసనం

56 నిమిషాల క్రితం

smart
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 04:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఏడ్చినప్పుడల్లా, తినిపించేటప్పుడల్లా చేతికి మొబైల్

- థెరపీ కేంద్రాల ముందు క్యూలు

- ‘దైనిక్‌ ‌భాస్కర్‌’ నివేదిక వెల్లడి

భోపాల్: పిల్లవాడు ఏడ్చినా, అన్నం తినకపోయినా, తల్లిదండ్రులు పనుల్లో ఉన్నా చేతికి ఫోన్ ఇవ్వడం కొవిడ్ కాలంలో, ఆ తర్వాత చాలా కుటుంబాల్లో దైనందిన అలవాటుగా మారింది. అయితే, ఈ అలవాటు పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని స్రీన్‌ ‌టైంమింగ్‌‌పై ‘దైనిక్‌ ‌భాస్కర్‌’ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.

ఆలస్యంగా మాటలు..

అధిక సమయం ఫోన్‌‌లో గడిపే పిల్లలకు మాటలు ఆలస్యంగా రావడం, కళ్లలోకి చూసి మాట్లాడకపోవడం, ఇతరులతో కలవకపోవడం, అతి చురుకుదనం వంటి సమస్యలతో భోపాల్‌లోని థెరపీ కేంద్రాలకు వస్తున్నారు. భోపాల్‌కు చెందిన సోనా రెండేళ్ల వరకు సాధారణంగా మాట్లాడేది. మొబైల్ అలవాటైన తర్వాత 2 ఏళ్ల 7 నెలలకు దాదాపు మాట్లాడటం మానేసింది. ఎనిమిదేళ్ల మాయిరాకు ఏడ్చినప్పుడల్లా మొబైల్ ఇచ్చేవారు, ఆరేళ్ల వయసులో థెరపీ మొదలైంది. ఏడేళ్ల ఆరిష్ ప్రశ్నకు జవాబు చెప్పకుండా అదే ప్రశ్నను తిరిగి అంటాడు. ఇలాంటి కేసులను కొందరు వైద్యులు, థెరపిస్టులు ‘వర్చువల్ ఆటిజం’ అని పిలుస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రచురితమైన ఒక పరిశోధనా పత్రం ప్రకారం ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందిన నిర్ధారణ కాదు. స్క్రీన్ వల్లే ఆటిజం వస్తుందనే తప్పుడు అభిప్రాయాన్ని ఈ పదం కలిగించే ప్రమాదం ఉందని, దానికి బదులు ‘‘స్క్రీన్‌తో ముడిపడిన ఎదుగుదల ఆలస్యం’’ అనే కచ్చితమైన పదాన్ని వాడాలని పరిశోధకులు సూచించారు.

తొలిదశలో గుర్తించడం కీలకం..

ఎదుగుదల ఆలస్యాన్ని తొలిదశలో గుర్తించడంలో ప్రభుత్వ జిల్లా ముందస్తు జోక్య కేంద్రాలు (డిఇఐసి) కీలకం. దేశవ్యాప్తంగా వందలాది కేంద్రాలున్నా, సిబ్బంది, సౌకర్యాల పరిస్థితి రాష్ట్రాన్ని బట్టి మారుతోంది. భోపాల్ జయప్రకాశ్ జిల్లా ఆసుపత్రిలోని డిఇఐసికి ఏప్రిల్–ఆగస్టు 2026 మధ్య ఆటిజంతో సంబంధమున్న 31 మంది పిల్లలు రాగా, వారిలో ఒక్కరిని మాత్రమే స్క్రీన్ టైమ్ కోణంలో పరిశీలించారు. ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్ వంటి పోస్టులు చాలాకాలంగా ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల సెన్సరీ ఇంటిగ్రేషన్ ఏరియా వినియోగంపైనా ప్రభావం పడుతోంది. ఖాళీల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినా నియామకాలు జరగలేదని సెంటర్ మేనేజర్ ఉజ్జవల్ సింగ్ చెప్పారు. ఆటిజంను, స్క్రీన్‌తో ముడిపడిన ఎదుగుదల లక్షణాలను వేరుగా గుర్తించే ప్రత్యేక అసెస్‌మెంట్ టూల్ కూడా అక్కడ లేదు. ఇలాంటి కేసులను ప్రత్యేక వర్గంగా నమోదు చేయకపోతే ఎన్ని కేసులున్నాయో అంచనా వేయడం, వాటికి వ్యూహం రూపొందించడం కష్టమని ఈ పరిస్థితి చెబుతోంది. సిబ్బంది కొరత వల్ల ప్రతి బిడ్డకూ తరచుగా థెరపీ ఇవ్వడం కష్టమవుతోందని డిఇఐసి సైకాలజిస్ట్ డాక్టర్ నీమ్రతా దూబే తెలిపారు. చాలామంది పిల్లలను ఫాలోఅప్ కోసం 15 రోజులకో, నెల తర్వాతో పిలవాల్సి వస్తోంది. తొలిదశ జోక్యం మరింత ప్రభావవంతంగా ఉండాలంటే తగినంత సిబ్బంది, సకాలంలో థెరపీ అవసరమని ఆమె అన్నారు.

కోవిడ్‌ ‌తరువాత పెరిగిన కేసులు..

ప్రైవేటు కేంద్రాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. రవి సెంటర్ నిర్వాహకురాలు తృప్తి మంగల్ (సుమారు 15 ఏళ్ల అనుభవం) ప్రకారం, లాక్‌డౌన్‌కు ముందు ఇలాంటి కేసులు ఏడాదికి పరిమితంగా వచ్చేవి, తర్వాత గణనీయంగా పెరిగాయి. కొన్ని తీవ్రమైన కేసుల్లో దూకుడు ప్రవర్తన, తమను తామే గాయపరచుకోవడం కూడా కనిపించాయి. అయితే ఒక కేంద్రం అనుభవాన్ని సమాజమంతటికీ వర్తించే కారణ-ఫలిత రుజువుగా చూడలేం. ఇతర రాష్ట్రాల్లోనూ చిత్రం భిన్నంగా ఉంది. జైపుర్‌లో డిఇఐసి రికార్డుల్లోనే ఉంది, క్షేత్రస్థాయిలో పూర్తిగా పనిచేయడం లేదు. పట్నాలో స్థలం, సిబ్బంది కొరత ఉంది. లఖ్‌నవూ కెజిఎంయు, డిఐఇసికి రోజూ పెద్ద సంఖ్యలో పిల్లలు వస్తున్నారు. గాంధీనగర్‌లో గత రెండేళ్లలో కేసులు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు, అక్కడ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఢిల్లీలోనూ సిబ్బంది కొరత ఉంది, కొవిడ్ తర్వాత కేసులు పెరిగాయని అంటున్నారు. ముంబైలో బిఎంసి కేంద్రాల ద్వారా సేవలు అందుతున్నా, ‘వర్చువల్ ఆటిజం’ నమోదు క్రమం తప్పకుండా జరగడం లేదు. అధిక స్క్రీన్ ఎక్స్‌పోజర్‌కు, ఆటిజం స్పెక్ట్రమ్ లక్షణాలకు మధ్య సంబంధం కనిపించినా, అందుబాటులో ఉన్న పరిశోధన ప్రధానంగా పరిశీలనాత్మకమైనది. స్క్రీన్ నేరుగా ఆటిజంను కలిగిస్తుందని అది నిరూపించదు. ఒక పెద్ద సిస్టమాటిక్ రివ్యూ కూడా ఆధారాలు మిశ్రమంగా ఉన్నాయని పేర్కొంది. కొందరు ఆటిస్టిక్ పిల్లలు స్క్రీన్‌ను ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉన్నందున ఈ సంబంధం రెండు దిశల్లోనూ ఉండవచ్చు.

సమస్య మొబైల్‌‌ ఒక్కటిదే కాదు..వ్యవస్థది కూడా

డబ్ల్యూహెచ్‌ఒ సూచన ప్రకారం ఏడాది వయసున్న పిల్లలకు స్క్రీన్ టైమ్ సిఫార్సు చేయరు, రెండేళ్ల వయసులో గంటకు మించకూడదు, మూడు నుంచి నాలుగేళ్ల పిల్లలకు గంట వరకే పరిమితం చేయాలి. పిల్లలు మాట్లాడకపోవడం, కళ్లలోకి చూడకపోవడం, పేరు పిలిస్తే స్పందించకపోవడం, ఒకే వీడియోపై అతి ఆసక్తి, ఇతరుల మాటలను తిరిగి అనడం వంటి సంకేతాలు కనిపిస్తే మొబైల్ అలవాటుగా భావించి నిర్లక్ష్యం చేయకుండా పీడియాట్రీషియన్ చూపించాలని డబ్ల్యూహెచ్‌ఒ సూచించింది. స్క్రీన్ టైమ్ ఆధారంగా మాత్రమే ఆటిజం అని నిర్ధారించకూడదు. మొత్తంగా సమస్య మొబైల్‌దే కాదు, వ్యవస్థది కూడా. తొలిదశ గుర్తింపు, తగినంత మంది థెరపిస్టులు, స్పష్టమైన అసెస్‌మెంట్ వ్యవస్థ, తల్లిదండ్రుల్లో అవగాహన ఉంటేనే పరిష్కారం సాధ్యమవుతుందని నివేదిక స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్