మల్లారెడ్డి నగర్ (నల్గొండ) : అఖిల భారత కిసాన్ సభ (AIKS) అధ్యక్షుడిగా డాక్టర్ అశోక్ ధావలే మరోసారి ఎన్నికయ్యారు. డాక్టర్ విజూ కృష్ణన్ ప్రధాన కార్యదర్శిగా, పుష్పేందర్ త్యాగి కోశాధికారిగా (ట్రెజరర్) ఎన్నికయ్యారు. కేరళకు చెందిన ఇ.పి. జయరాజన్, ఎం. విజయకుమార్, ఎస్.కె. ప్రీజ ఉపాధ్యక్షులుగా; కృష్ణ ప్రసాద్, కె.ఎన్. బాలగోపాల్, వల్సన్ పానోలి సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఓమల్లూర్ శంకరన్, ఎం. స్వరాజ్, ఎం. ప్రకాశన్, కె.కె. రాగేష్, గోపి కోట్టమురిక్కల్ కేంద్ర కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు.

అశోక్ ధావలే :
భారతదేశ రైతు ఉద్యమాలలో మూడు దశాబ్దాలకు పైగా కీలక పాత్ర పోషిస్తున్న పోరాట యోధుడు అశోక్ ధావలే మరోసారి అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.
1978లో ఎస్ఎఫ్ఐ (SFI) ద్వారా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. మహారాష్ట్రకు చెందిన ఆయన ఎంబీబీఎస్ పట్టభద్రుడు. 1980 నుండి 1989 వరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా, అఖిల భారత ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1989 నుండి 1995 వరకు డీవైఎఫ్ఐ (DYFI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు.
1993లో అఖిల భారత కిసాన్ సభలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001 నుండి 2009 వరకు కిసాన్ సభ మహారాష్ట్ర రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2017లో హర్యానాలో జరిగిన 34వ అఖిల భారత మహాసభలో మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1998 నుండి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2005 నుండి 2015 వరకు మహారాష్ట్ర రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఆయన, కన్నూర్‌లో జరిగిన 23వ పార్టీ కాంగ్రెస్‌లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ఈయన సతీమణి.

విజూ కృష్ణన్ : కిసాన్ సభ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, రైతులను హక్కుల పోరాటంలో ఏకం చేసిన నాయకత్వ పటిమతో విజూ కృష్ణన్ మరోసారి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈయన కూడా సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడే.
1995లో జేఎన్‌యూ (JNU)లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా ప్రజా రంగంలోకి ప్రవేశించారు. 2004లో ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన అనంతరం, బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008లో అధ్యాపక వృత్తిని విడిచిపెట్టి, భారతీయ రైతుల సమస్యలను భుజానికెత్తుకుని ప్రజా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు.
2009 నుండి కిసాన్ సభ పూర్తికాలపు కార్యకర్తగా వివిధ రాష్ట్రాల రైతులను సంఘటితం చేస్తూ ఉద్యమాలలో ముందుండి నడిపించారు. 2018లో మహారాష్ట్రలో జరిగిన చారిత్రాత్మక 'కిసాన్ లాంగ్ మార్చ్' నుండి ఢిల్లీ రైతు పోరాటం వరకు అనేక ఉద్యమాలకు ప్రధాన నాయకత్వం వహించారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అనుబంధ సంస్థ అయిన 'ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ ఇన్ అగ్రికల్చర్' సెక్రటేరియట్ సభ్యుడిగా కూడా ఉన్నారు.
కేరళలోని కన్నూర్ జిల్లా కరివెళ్లూరుకు చెందిన డాక్టర్ పి. కృష్ణన్, వైక్కం శ్యామల దంపతుల కుమారుడు విజూ కృష్ణన్. పరిశోధకురాలు సమత ఈయన భార్య. వీరికి రియా అనే కుమార్తె ఉంది.
నూతన కమిటీ :
అశోక్ ధవాలే -అధ్యక్షులు
విజూ కృష్ణన్ -కార్యదర్శి
హన్నన్ మొల్లా -ఉపాధ్యక్షలు
అమ్రారామ్ -ఉపాధ్యక్షలు
ఇ.పి.జయరాజన్ -ఉపాధ్యక్షలు
పరేష్ పాల్ -ఉపాధ్యక్షలు
ఎం.విజయకుమార్ -ఉపాధ్యక్షలు
ఎస్.కె.ప్రీజ -ఉపాధ్యక్షలు
ఇందర్‌జిత్ సింగ్ వి -ఉపాధ్యక్షలు
జితేందర్ చౌదరి -ఉపాధ్యక్షలు
బాదల్ సరోజ్ -ఉపాధ్యక్షలు
వినోద్ కుమార్ -ఉపాధ్యక్షలు
ముకుల్ సింగ్ -ఉపాధ్యక్షలు
పి.కృష్ణ ప్రసాద్ -సహాయకార్యదర్శి
అవాదేశ్ కుమార్-సహాయకార్యదర్శి
మరియం ధవాలే -సహాయకార్యదర్శి
కె.ఎన్.బాలగోపాల్ -సహాయకార్యదర్శి
వల్సాన్ పనోలి -సహాయకార్యదర్శి
అజిత్ నవలే -సహాయకార్యదర్శి
రతన్ దాస్ -సహాయకార్యదర్శి
పరమేశ్ పాల్ -సహాయకార్యదర్శి
టి.సాగర్ -సహాయకార్యదర్శి
ప్రభాకర్ రెడ్డి -సహాయకార్యదర్శి








కామెంట్‌లు (0)