సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్యూబాలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌ఒ చీఫ్‌

22 నిమిషాల క్రితం

who.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 03:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హవానా : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ ఆదివారం క్యూబాకు చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడంతోపాటు, తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభంపై అంతర్జాతీయ సహకారాన్ని సమీకరించే మార్గాలపై చర్చించనున్నారు. క్యూబా ప్రజల నుంచి పరిస్థితులపై నేరుగా వివరాలు తెలుసుకుని, అవసరమైన సాయం అందించేందుకు, అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగట్టేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు టెడ్రోస్‌ తెలిపారు. విద్యుత్‌ కొరత, ఆర్థిక ఇబ్బందులు క్యూబా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వైద్య పరికరాల వినియోగం, టీకా కార్యక్రమాలు, శస్త్రచికిత్సలకు అంతరాయాలు ఏర్పడుతున్నాయని క్యూబా అధికారులు వెల్లడించారు. వైద్య సేవలకు అవసరమైన మందులు, ఇతర నిత్యావసర వస్తువుల కొరత కూడా తీవ్రంగా ఉందని తెలిపారు.

2018లో డబ్ల్యూహెచ్‌ఒ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం, టెడ్రోస్‌ క్యూబాలో పర్యటించడం ఇది రెండవసారి. గత మార్చిలో అక్కడి పరిస్థితిని ఆయన తీవ్ర ఆందోళనకరంగా అభివర్ణించారు. ఇంధన కొరత కారణంగా ఆస్పత్రుల్లో అత్యవసర, ఇంటెన్సివ్‌ కేర్‌ సేవలను కొనసాగించడం కూడా కష్టంగా మారిందని హెచ్చరించారు. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు క్యూబా చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తూ.. ఇంధన అస్థిరత, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా వైద్య సేవలకు విఘాతం కలగకూడదని స్పష్టం చేశారు.

హవానా చేరుకున్న టెడ్రోస్‌కు క్యూబా ఆరోగ్యశాఖ మంత్రి జోస్‌ ఏంజెల్‌ పోర్టల్‌, క్యూబాలోని డబ్ల్యూహెచ్‌ఒ, పాన్‌ అమెరికన్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (పీఏహెచ్‌ఒ) ప్రతినిధి మారియో క్రూజ్‌ స్వాగతం పలికారు. మంగళవారం వరకు కొనసాగే పర్యటనలో భాగంగా ఆయన క్యూబా అధికారులతో సమావేశమవడంతో పాటు , ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, పలు సంస్థలను సందర్శించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్