అమరావతి : కోస్తాంధ్ర తీరానికి అతి సమీపంలో ఉన్న మురసు తుఫాన్ ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ నుంచి అధికారులు, జిల్లాల కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించారు. తుఫాన్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. దక్షిణ కోస్తాంధ్రలోని దిగువ ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నీటి ప్రవాహాలు పెరగవచ్చని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోకి సుమారు 13 నుంచి 15 టీఎంసీల వరకు నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇటీవల అర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని సిఎం చంద్రబాబు తెలిపారు. అయితే మురసు తుఫాన్ ప్రభావాన్ని కూడా సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అర్నబ్ తుఫాన్‌తో పోలిస్తే మురసు ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అయినా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. అర్నబ్ తుఫాన్ సమయంలో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాలకు 31 వేల విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయికి పంపించినట్లు వివరించారు. మురసు తుఫాన్ గాలుల కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో యంత్రాంగం సన్నద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు వర్షాల ద్వారా వచ్చే నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం సహా వివిధ ప్రాంతాల్లోని చెరువులను నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ బేసిన్‌లోని వివిధ రిజర్వాయర్లలోనూ నీటిని నిల్వ చేసేలా సమర్థ నీటి నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేలా సమన్వయంతో పనిచేయాలని సిఎం అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
మురసు తుఫాన్ ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై సిఎం చంద్రబాబు సమీక్ష
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 01:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)