అమరావతిలోని రాయపూడి సి ఆర్ డి ఎ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన.. గ్రామకంఠాల సమస్య పై .. రోడ్డెక్కుతాం
రాయపూడి సి ఆర్ డి ఎ కార్యాలయం వద్ద రాజధాని రైతుల ఆందోళన
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు) : గ్రామకంఠాల సమస్య పరిష్కరించకపోతే రోడ్డెక్కాల్సి వస్తుందని రాజధాని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికారులు గ్రామకంఠాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కూడా తప్పుడు నివేదికలు తయారుచేసి అన్యాయం చేశారని అమరావతి లోని రాయపూడి సి ఆర్ డి ఎ కార్యాలయం వద్ద రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు 'గ్రామకంఠం పేరుతో రైతు కంఠం కు ఉరి వెయ్యొద్దు బాబు..' 'బలవంతపు భూసేకరణను తక్షణమే ఆపాలంటూ..' ప్లకార్డులు ప్రదర్శించారు. నేటి నుండి సి ఆర్ డి ఎ గ్రీవెన్స్ లేకపోవడంతో రైతులు డిప్యూటీ కలెక్టర్ భాగ్యరేఖను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందికి ఎకరాల చొప్పున గ్రామకంఠాలు కేటాయించి మరికొంతమందికి మాత్రం 10 సెంట్లు ఇవ్వడానికి కూడా ఒప్పుకోకపోవడం ఏమిటని నిలదీశారు. గ్రామాల్లో దొడ్లు, బ్యారన్లు కూడా వదలరా.. భూములిస్తే ఎన్ని ఎకరాలైనా తీసుకుంటారు.. ల్యాండ్ పూలింగ్ అంటూ లక్షల ఎకరాలు తీసుకుంటున్నారు.. రైతుకు మాత్రం కొన్ని సెంట్లు మినహాయింపు ఇవ్వరా.. అని మండిపడ్డారు. త్రిమెన్ కమిటీ కూడా గ్రామకంఠాల వ్యవహారంలో 'మాకు న్యాయం చేయాలేదంటూ` వాపోయారు. గ్రామకంఠాలకు సంబంధించి 9.2 వివరాలను సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. గ్రామకంఠాల సమస్య పరిష్కారం కోసం 750 మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే కేవలం 17 మందికి మాత్రమే న్యాయం జరిగిందని అన్నారు. తన్నులు తిని ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే గ్రామకంఠాల ను కూడా వ్యవసాయ భూములని చెబుతూ లాక్కుంటోదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలు, యూనివర్సిటీ లకు ఎన్ని వందల ఎకరాలను కేటాయించారనీ, వాళ్ళు నిర్మాణాలకు సంబంధించి పునాదులైనా వేశారా.. అని ప్రశ్నించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. అక్కడ నుంచి కార్యాలయం బయటికి వచ్చి ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. రెండు, మూడు సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజధాని 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)