సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Cyclone Akvan - తీరం దాటిన అక్వాన్ తుపాను.. ఉత్తరాంధ్రకు వర్ష సూచన

3 రోజుల క్రితం

Cyclone Akwan crosses the coast rain forecast for North Andhra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 11:19 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

- ఒడిశాలో దాదాపు 3 లక్షల మందికి సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం

- పలు పర్యాటక ప్రాంతాలు, పార్కులు తాత్కాలికంగా మూసివేత


ప్రజాశక్తి – అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను అక్వాన్ ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య తుపాను తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయని, గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.


తుపాను తీరం దాటినప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలపై దాని ప్రభావం కొనసాగుతుందని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తుండగా, మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బలమైన గాలులు, వర్షాల తీవ్రత కొనసాగే అవకాశమున్నందున శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.


మరోవైపు తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఒడిశా ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు చెందిన 2,98,676 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వీరికి 2,523 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించింది. అత్యవసర పరిస్థితుల కోసం మొత్తం 9,341 షెల్టర్లను సిద్ధం చేసినట్లు ప్రత్యేక సహాయక కమిషనర్ రాజేష్ పి. పాటిల్ వెల్లడించారు.


గంజాం జిల్లాలో అత్యధికంగా 1,38,311 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ వి. కీర్తి వాసన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యల కోసం 423 రెస్క్యూ బృందాలను మోహరించారు. వీటిలో 60 ఓడ్రాఫ్, 14 ఎన్డీఆర్ఎఫ్, 131 అగ్నిమాపక, అత్యవసర సేవల బృందాలు ఉన్నాయి.


తుపాను ముప్పు దృష్ట్యా ఒడిశాలోని పలు పర్యాటక ప్రాంతాలపై అధికారులు ఆంక్షలు విధించారు. ప్రముఖ పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలను తాత్కాలికంగా మూసివేశారు. తీర ప్రాంతాల్లోని ప్రమాదకర ప్రదేశాలకు పర్యాటకులు వెళ్లకుండా నిషేధం విధించారు. భువనేశ్వర్‌లోని నందన్‌కనన్ జులాజికల్ పార్క్, భితర్‌కనికా నేషనల్ పార్క్, సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.


అలాగే పూరీలోని గుండిచా ఆలయాన్ని నవంబర్ 21 వరకు మూసివేయాలని నిర్ణయించారు. అయితే పూరీ జగన్నాథ ఆలయంలో నిత్య పూజలు, ఇతర సంప్రదాయ ఆచారాలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్