రేపటి నుండి ప్రభావం
బలమైన ఈదురుగాలులతో, భారీ వర్షాల హెచ్చరిక
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గురు, శుక్ర వారాల్లో బలమైన ఈదురు గాలులతో, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈనెల 18 వ తేదిన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 19న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సోమవారం నుండి తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరుకోవాలని సూచించారు. ఈ నెల 16 నుంచి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.






కామెంట్‌లు (0)