హాయ్ ఫ్రెండ్స్!
చదువంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలను నేర్చుకోవడమే కాదు.. మన చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు కనుగొనడం కూడా. మన ఆలోచనలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తే ఎన్నో అద్భుతాలు చేయవచ్చని మా పాఠశాలలో చేసిన ఓ ప్రయోగం ద్వారా తెలుసుకున్నాం. స్కూల్ యాజమాన్యం అందించిన ప్రోత్సాహంతో మా ఆలోచనలు, కృత్రిమ మేధ, రోబోటిక్స్ ప్రయోగశాలలో ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులం కలిసి స్వయంచాలక పాఠశాల గంట (ఆటోమేటిక్ స్కూలుబెల్ అలారం) పరికరాన్ని రూపొందించాం.
మా పాఠశాలలో తరగతుల ప్రారంభం, ముగింపు, మధ్యాహ్న భోజన విరామ సమయాల్లో గంట మోగించాల్సి ఉంటుంది. ప్రతిసారీ సిబ్బంది సమయాన్ని గమనించి, గంట మోగించాల్సిన అవసరం లేకుండా, నిర్ణీత సమయానికి దానంతట అదే గంట మోగించే పరికరాన్ని తయారుచేయాలని ఆలోచించాం. సమయ నియంత్రణ వ్యవస్థ, విద్యుత్ నియంత్రణ వలయం, విద్యుత్ ప్రసార నియంత్రిక వంటి పరికరాలను ఉపయోగించి, ఈ ప్రయోగాన్ని రూపొందించాం. పాఠశాల సమయ పట్టికకు అనుగుణంగా గంట మోగే సమయాలను నిర్ణయించుకునేలా ఏర్పాటు చేశాం. ఈ ప్రయోగం ద్వారా విద్యుత్ వలయాల అనుసంధానం, పరికరాల పనితీరు, సమయ నియంత్రణ, స్వయంచాలక సాంకేతికత గురించి ఆచరణాత్మకంగా తెలుసుకున్నాం.
కృత్రిమ మేధతో నేర్చుకున్నాం..
ఈ ప్రయోగంలో కృత్రిమ మేధ కూడా మాకు ఉపయోగకరమైన సాధనంగా మారింది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి, ప్రాజెక్టు రూపకల్పనపై కొత్త ఆలోచనలు పొందడానికి ఇది తోడ్పడుతుంది. అయితే కృత్రిమ మేధ ఇచ్చే సమాచారమంతా సరైనదేనని గుడ్డిగా నమ్మకూడదని తెలుసుకున్నాం. ఉపాధ్యాయుల సూచనలతో సమాచారాన్ని పరిశీలించి, నిర్ధారించుకున్న తర్వాతే ఉపయోగించాలి. వ్యక్తిగత వివరాలు, రహస్య సంకేతాలు వంటి సమాచారాన్ని పంచుకోకూడదు. కృత్రిమ మేధపై పూర్తిగా ఆధారపడకుండా మన సొంత ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలి. తగిన జాగ్రత్తలతో ఉపయోగించుకుంటే ఇది మన చదువుకు, సృజనాత్మకతకు మంచి సహాయకారిగా ఉంటుందని మా అనుభవం ద్వారా తెలుసుకున్నాం.
పాఠశాల ప్రోత్సాహంతో మరిన్ని ఆవిష్కరణలు!
మా ఆలోచనలను ప్రోత్సహిస్తూ, వాటిని ఆచరణలో పెట్టేందుకు అవకాశాలు కల్పిస్తున్న పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు. మా స్కూల్ చైర్మన్ కె. ప్రసాద్, డైరెక్టర్ జె. కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ కె. సాగర్ మాకు అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఈ ప్రయోగ రూపకల్పన, తయారీలో మార్గదర్శిగా వ్యవహరిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. వారి సహకారంతో మా ఆలోచనకు ఆచరణ రూపం ఇవ్వగలిగాం. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు మా ప్రయోగశాలలో ఆధునిక విద్యుత్ పరికరాలు, గ్రాహకాలు, సూక్ష్మ నియంత్రకాలు, రోబోటిక్స్ పరికరాలు సమకూరుస్తున్నారు.
ఈ ప్రయోగం ద్వారా బృందంగా పనిచేయడం, సమస్యలను గుర్తించడం, పరిష్కారాలను ఆలోచించడం, ఓర్పుతో ప్రయోగాలు చేయడం వంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. భవిష్యత్తులో తెలివైన పాఠశాల పరికరాలు, వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలు, గ్రాహకాల ఆధారిత పరికరాలు, రోబోటిక్ యంత్రాలను తయారు చేయాలనుకుంటున్నాం. సాంకేతికతను కేవలం ఉపయోగించుకునేవారిగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలు చేసే వారిగా ఎదగాలన్నదే మా లక్ష్యం.
మా నినాదం ఒక్కటే.. కృత్రిమ మేధను జాగ్రత్తగా ఉపయోగిద్దాం.. మన ఆలోచనలకు సాంకేతికతను జోడించి కొత్త ఆవిష్కరణలు చేద్దాం!
ఇట్లు
ప్రాజెక్టులో పాల్గొన్న విద్యార్థులు:
9వ తరగతి: ఈ. సహస్ర, చి. చైత్ర, ఓ. అక్షిత, ఎన్. కృష్ణ మనోహర్.
8వ తరగతి: ఎన్. కోమలి, కె. హర్షిక, జి. విష్ణు విలాసిని, వి. షణ్ముఖ సాయి, టి. ఏకనాథ్.
అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్,
కారెంపూడి, పల్నాడు జిల్లా.






కామెంట్లు (0)