హైదరాబాద్: నగర శివారులోని బౌరంపేటలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పార్కింగ్ యార్డులో నిలిపి ఉంచిన ఐదు ట్రావెల్స్ బస్సులు మంటలకు ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్రాయి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పార్కింగ్ స్థలంలో బస్సులను ఒకదానికొకటి సమీపంలో నిలిపి ఉంచడంతో ఒక బస్సులో చెలరేగిన మంటలు వేగంగా మిగిలిన బస్సులకు వ్యాపించాయి. దీంతో మూడు బస్సులు పూర్తిగా దగ్ధం కాగా, మరో రెండు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
అర్ధరాత్రి సమయంలో దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు, సమీపంలోని పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జీడిమెట్ల అగ్నిమాపక కేంద్రం సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మరోవైపు బస్సుల సమీపంలోని చెత్తకుప్పకు నిప్పు అంటుకోవడం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి అసలు కారణాలు, ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.






కామెంట్‌లు (0)