అనిరుధ్–కావ్యలది ‘స్వాభిమాన వివాహం’.. ఇదీ ప్రత్యేకత !
చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహం ఇప్పుడు మరో ప్రత్యేకతతో వార్తల్లో నిలిచింది. గ్రీస్‌లో నవంబర్ 11న ఒక్కటైన ఈ జంట సంప్రదాయబద్ధమైన మతపరమైన ఆచారాలకు భిన్నంగా ‘సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్’ (స్వాభిమాన వివాహం) పద్ధతిలో వివాహం చేసుకుంది. ఈ పెళ్లి తంతు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
వీరి వివాహ పద్ధతికి సంబంధించిన వివరాలను డీఎంకే నేత టీఆర్‌బీ రాజా వెల్లడించారు. వధూవరులు ఒకరికొకరు పూలమాలలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కావ్యకు ఒక గొలుసును అందించగా, సూపర్‌స్టార్ రజనీకాంత్ అనిరుధ్‌కు మరో గొలుసును అందించారు. అనంతరం ఇద్దరూ ఆ గొలుసులను పరస్పరం మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది.
పెరియార్ ఉద్యమం నుంచి పుట్టిన సంప్రదాయం !
స్వాభిమాన వివాహం వెనుక ఓ సామాజిక సంస్కరణ ఉద్యమ చరిత్ర ఉంది. తమిళ సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి ప్రారంభించిన స్వాభిమాన ఉద్యమం నుంచి ఈ వివాహ విధానం రూపుదిద్దుకుంది. కుల వివక్షకు, మతపరమైన ఆచారాలకు, వివాహాల్లో మతపెద్దల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఈ వివాహ విధానంలో వేద మంత్రాలు, పురోహితులు, విస్తృతమైన మతపరమైన క్రతువులకు ప్రాధాన్యం ఉండదు. వధూవరుల పరస్పర అంగీకారమే ప్రధానమవుతుంది. పూలమాలలు మార్చుకోవడం, తాళి లేదా గొలుసులు ధరింపజేసుకోవడం ద్వారా వివాహ బంధాన్ని ప్రకటిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ వేడుకకు సాక్షులుగా నిలుస్తారు.
సామాజిక సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ, పరస్పర గౌరవానికి ప్రాధాన్యమిచ్చే ఈ తరహా వివాహాలకు 1967లో తమిళనాడు ప్రభుత్వం చట్టబద్ధమైన గుర్తింపు కల్పించింది.
సినీ, క్రీడా రంగాలతో అనుబంధం ఉన్న ప్రముఖుల వివాహం కావడంతో అనిరుధ్–కావ్యల స్వాభిమాన వివాహం మరోసారి ఈ ప్రత్యేక వివాహ విధానంపై చర్చకు తెరలేపింది. కాగా, వీరి వివాహ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో జరగనుంది.







కామెంట్‌లు (0)