శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Microsoft - మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం - తప్పని డిజిటల్ కష్టాలు !

20 నిమిషాల క్రితం

Global disruption to Microsoft services company responds
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 10:37 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఓపెన్ ఎఐ, ఆంత్రోపిక్ ఎఐ సేవలపైనా ప్రభావం.. ఇబ్బందుల్లో వేలాది మంది వినియోగదారులు


సైటెక్ : ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన కీలక ఆన్‌లైన్ సేవలు సుమారు ఏడు గంటలకు పైగా నిలిచిపోవడంతో వేలాది మంది వినియోగదారులు అవస్థలు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365, ఔట్‌లుక్, టీమ్స్‌తో పాటు పలు అప్లికేషన్లు ఈ సాంకేతిక సమస్య కారణంగా పనిచేయలేదు. మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్లపై ఆధారపడిన ఓపెన్‌ఏఐ (OpenAI), ఆంత్రోపిక్ (Anthropic) సంస్థల ఎఐ సేవలు సైతం ఈ అంతరాయం ప్రభావానికి గురయ్యాయి.


డౌన్‌డిటెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం .... శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఔట్‌లుక్ సేవలు పనిచేయడం లేదంటూ 1,38,058 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఉదయం 4.30 గంటల సమయానికి ఈ ఫిర్యాదుల సంఖ్య 34,490కు తగ్గింది. ఈ సమస్యపై స్పందించిన మైక్రోసాఫ్ట్.. ప్రభావితమైన సర్వర్లను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. వినియోగదారులు మళ్లీ సేవలకు అనుసంధానమవుతుండటంతో వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోందని వెల్లడించింది.


సర్వర్లలో సురక్షిత కనెక్షన్లు ఏర్పాటుచేసే ప్రక్రియలో ఏర్పడిన అధిక సాంకేతిక భారం ఈ అంతరాయానికి ప్రధాన కారణమని మైక్రోసాఫ్ట్ ప్రాథమిక విచారణలో గుర్తించింది. దీంతో వినియోగదారుల నుంచి వచ్చే అభ్యర్థనలను సర్వర్లు సక్రమంగా ప్రాసెస్ చేయలేకపోయాయి. సమస్య పరిష్కారానికి కొత్త కాన్ఫిగరేషన్ మార్పును రూపొందించి, తొలుత కొన్ని సర్వర్లపై పరీక్షించిన అనంతరం ఇతర సర్వర్లకు కూడా విస్తరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్‌లో చేసిన మార్పులను వెనక్కి తీసుకునే చర్యలూ చేపట్టినట్లు వివరించింది.


ఈ సాంకేతిక లోపం వల్ల ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వెబ్‌సైట్, డెస్క్‌టాప్, మొబైల్ యాప్‌ల ద్వారా ఔట్‌లుక్ మెయిల్స్‌ను తెరవడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ కోపైలట్, టీమ్స్‌లోని క్యాలెండర్, సమావేశాల షెడ్యూలింగ్ సదుపాయాలు కూడా సరిగా పనిచేయలేదు. వీటితో పాటు ప్లానర్, టూ డూ, డిఫెండర్, పవర్ బీఐ, షేర్‌పాయింట్ ఆన్‌లైన్, విండోస్ 365 వంటి ఇతర సేవలపైనా ప్రభావం పడింది.


మైక్రోసాఫ్ట్‌కు చెందిన అప్లికేషన్లకే పరిమితం కాకుండా, ఆ సంస్థ సాంకేతిక మౌలిక సదుపాయాలను వినియోగించుకునే ఇతర సంస్థల సేవలకూ అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ కనెక్టర్లలో తలెత్తిన సమస్యతో కొత్త కనెక్షన్లు ఏర్పాటు కావడం లేదని ఓపెన్ ఎఐ వెల్లడించింది. ఈ పరిణామం పలు వ్యాపార సంస్థల కార్యకలాపాలపైనా ప్రభావం చూపింది.


ఇటీవల అజ్యూర్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లో సమస్యలు తలెత్తిన కొద్ది వారాలకే మరోసారి ఇంతటి భారీ సాంకేతిక అంతరాయం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆధారపడుతున్న డిజిటల్ సేవల్లో తలెత్తుతున్న ఇటువంటి సమస్యలు టెక్నాలజీ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్