- సిపిఎం కార్పొరేటర్ గా కృష్ణయ్య గెలుపు
- హ్యాట్రిక్ విజయంతో సంబరాలు
ప్రజాశక్తి - విశాఖపట్నం : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) ఎన్నికల ఫలితాల్లో సిపిఎం బోణీ కొట్టింది. ఆ పార్టీ నుంచి 105వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన ఎం. కృష్ణయ్య విజయ ఢంకా మోగించారు. ఈ వార్డులో 8884 మంది ఓటర్లు ఉండగా 2712 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం ఫలితాలు విడుదలకాగా సిపిఎం అభ్యర్థి కృష్ణయ్యకు 1068 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్థికి 961, వైసిపి అభ్యర్థికి 620 ఓట్లు వచ్చాయి. నోటాకు 25 ఓట్లు పడ్డాయి. 38 ఓట్లు చెల్లలేదు. సిపిఎం అభ్యర్థి 107 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. తాజా గెలుపుతో ఈ వార్డులో సిపిఎం హ్యాట్రిక్ కొట్టినట్టు అయింది. గతంలో ఇదే వార్డు నుంచి విమల, డాక్టర్ బి.గంగారావు గెలుపొందారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం నిర్వహించిన అనేక పోరాటాలు, కార్మికుల పక్షాన తలపెట్టిన ఉద్యమాలు ఈ విజయానికి దోహదపడ్డాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు చేస్తున్నా టిడిపి, జనసేన, వైసిపి ఏనాడూ అడ్డుకోలేదు. ఉక్కు పరిరక్షణపై మాటలు చెప్పాయి తప్ప ఆ పార్టీలు ఏనాడూ చిత్తశుద్ధితో పనిచేయలేదు. సిపిఎం మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐదున్నర ఏళ్ళుగా నిరవధికంగా పోరాటాలు చేస్తోంది. ఆ విషయాన్ని గుర్తించిన ఓటర్లు ఈసారి మళ్లీ సిపిఎంకే విజయం కట్టబెట్టారు. ఎర్రజెండా విజయంతో విశాఖలోని సిపిఎం జిల్లా కార్యాలయం ఏచూరి భవన్ వద్ద సంబరాలు మిన్నంటాయి.









కామెంట్లు (0)