శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎపి పరిషత్ ఫలితాలపై ఎస్ఇసి కీలక ప్రకటన

6 గంటల క్రితం

SECs key announcement regarding AP Parishad election results
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 03:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఇసి) అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. శనివారం నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ .... లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని, సాయంత్రం 4 గంటల సమయానికి అన్ని స్థానాల తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలిపారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను తెరిచి లెక్కింపు చేపడుతున్నామని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోని ప్రతీ చర్యను సీసీ టివి కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న లెక్కింపు విధానం పట్ల కౌంటింగ్ ఏజెంట్లు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. భవిష్యత్తు అవసరాలు, కోర్టు కేసుల పరిశీలన కోసం ఈ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను 60 రోజుల పాటు భద్రపరుస్తామని, ఏవైనా న్యాయపరమైన వివాదాలు ఉంటే మరింత కాలం దాచి ఉంచుతామని వివరించారు. పల్నాడు జిల్లా కంకణాలపల్లి గ్రామస్థులు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జికి బదులుగా ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతూ బ్యాలెట్ బాక్సులో వేసిన కరపత్రాల అంశంపై ఎస్ఇసి స్పందించారు. ఇది స్థానిక జిల్లా యంత్రాంగ పరిధిలోని సమస్య అని ఆయన బదులిచ్చారు. అలాగే, ఏవైనా పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగినట్లు జిల్లా కలెక్టర్ అధికారికంగా నివేదిక సమర్పిస్తేనే రీ పోలింగ్ నిర్వహణపై పరిశీలిస్తామని స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే, త్వరలోనే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తామని వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్