సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తొత్తుగా మారింది : వైఎస్.జగన్

1 గంట క్రితం

jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 12:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తాడేపల్లి (గుంటూరు) : డెమోక్రసీని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకు తొత్తుగా మారిందని వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అక్రమాలకు చంద్రబాబుకు ఎస్‌ఇసి ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి.. పులివెందుల సహా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోలింగ్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యమని జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నికల్లో అక్రమాలపై చేసే న్యాయ పోరాటంలో గెలుపు ఆలస్యం కావొచ్చేమోగానీ, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయని వైఎస్‌ జగన్‌ పునరుద్ఘాటించారు.


'' నిన్న పులివెందులలో 80 పోలింగ్‌ బూత్‌ల్లో 70 చోట్ల వైసిపికి చెందిన ఏజెంట్లను లేకుండా చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాల నుంచి వచ్చిన టిడిపి గూండాలు స్వైరవిహారం చేసి, మా పార్టీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల మా ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు లాగేశారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌, సైక్లింగ్‌ చేశారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 70 బూత్‌ల్లో మా పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా నా సమక్షంలోనే, అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసింది. అయినా ఎస్ఇసి స్పందించిన తీరు అత్యంత దారుణం. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయం ?. ఎస్ఇసి చేసింది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా ? వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని అంటామా ? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది ? పులివెందులలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయి. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్‌, నాయుడు పేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల్టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయి. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తాం. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి `’ అని వైఎస్.జగన్ పేర్కొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్