అమెరికా : అడవుల్లో చెలరేగిన మంటలు జనావాసాలను చుట్టుముట్టాయి. వేలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. నగరమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. అయితే మంటలు చల్లారిన తర్వాత కూడా ప్రమాదం ముగియలేదు. మంటల నుంచి వెలువడిన విషపూరిత రసాయనాలు గాలిలో కలవడంతో లక్షలాది మంది ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది. ఏకంగా 70 లక్షల మంది ఈ విషపూరిత గాలిని పీల్చినట్లు తాజా పరిశోధన వెల్లడించింది.
2025 జనవరిలో అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో సంభవించిన కార్చిచ్చు ప్రభావాలపై కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మంటలు కేవలం అడవులకే పరిమితం కాకుండా జనావాసాల్లోకి విస్తరించాయి. ఇళ్లు, వాహనాలు, ప్లాస్టిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమవడంతో వాటిలోని హానికర రసాయనాలు పొగ ద్వారా వాతావరణంలోకి చేరాయి.
ఈ కార్చిచ్చు సమయంలో వెలువడిన పొగలో విషపూరిత లోహాల స్థాయులు సాధారణం కంటే గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా సీసం స్థాయులు 80 రెట్లకు పైగా పెరగ్గా, ఆర్సెనిక్ మూడు రెట్లు అధికంగా నమోదైంది. క్లోరిన్, బ్రోమిన్ స్థాయులు ఏడు రెట్లు పెరిగాయి. ఈటన్ ఫైర్ నుంచి వెలువడిన పొగలో విషపూరిత లోహాల సాంద్రత మరింత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది.
ఈ రసాయనాల ప్రభావం మానవ ఆరోగ్యంపై తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సీసం నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పిల్లల్లో మెదడు ఎదుగుదలను అడ్డుకోవడంతోపాటు మేధో సామర్థ్యాన్ని తగ్గించే అవకాశం ఉంది. పెద్దల్లో అధిక రక్తపోటు వంటి సమస్యలకు కారణమవుతుంది. మరోవైపు ఆర్సెనిక్ కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంది.
అయితే తక్కువ వ్యవధిలో ఇంతటి అధిక స్థాయిలో విషపూరిత పదార్థాలకు గురైన ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిశోధన 70 లక్షల మంది వరకు విషపూరిత కాలుష్యానికి గురై ఉండవచ్చని సూచిస్తున్నప్పటికీ, వారిలో ఎంతమందికి అనారోగ్య సమస్యలు తలెత్తాయనే విషయాన్ని నిర్ధారించలేదు.
ఈ అధ్యయనం కార్చిచ్చు ప్రమాదంపై కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. సాధారణంగా అడవుల్లో చెట్లు, గడ్డి కాలిపోవడమే కార్చిచ్చు అనుకుంటాం. కానీ మంటలు నివాస ప్రాంతాలకు విస్తరించినప్పుడు ఇళ్లు, వాహనాలు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా దగ్ధమవుతాయి. దీంతో వెలువడే పొగ సాధారణ పొగ కంటే ప్రమాదకరమైన రసాయనాల మిశ్రమంగా మారుతుంది.
మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ... మంటలు ఒక ప్రాంతానికే పరిమితమైనా, వాటి నుంచి వెలువడే విషపూరిత పొగ గాలుల ద్వారా మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి ప్రాణాలు కాపాడుకోగలరు. కానీ కంటికి కనిపించని విషపూరిత కాలుష్యం నుంచి రక్షించుకోవడం అంత సులభం కాదు. కార్చిచ్చు ముగిసిన తర్వాత కూడా ప్రజల ఆరోగ్యాన్ని వెంటాడే ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలన్నది ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న కీలక సవాలు.








కామెంట్‌లు (0)