శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AI ​​Effect - ఎస్‌ఎపి లో 10 వేల ఉద్యోగాల కోత !

12 నిమిషాల క్రితం

The AI ​​Effect 10000 Job Cuts at SAP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 03:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జర్మనీ : జర్మనీకి చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఎస్ఎపి (SAP) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆధారిత వ్యాపార మార్పుల్లో భాగంగా సుమారు 10 వేల ఉద్యోగాలను తగ్గించే ప్రతిపాదనను కంపెనీ పరిశీలిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 9 శాతానికి సమానం.


సిఇఒ క్రిస్టియన్ క్లైన్ నేతృత్వంలో ఎస్ఎపి తన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో ఎఐ వినియోగాన్ని విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది. ఎఐ ఆధారిత సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను మార్చడంతోపాటు, నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం ఈ పునర్‌ వ్యవస్థీకరణ లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రొడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో మార్పులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.


ఎఐ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించే క్రమంలో సంస్థ ఇప్పటికే నియామకాలపై ఆంక్షలు విధించింది. గత జులైలో ఎఐ కి సంబంధించిన ఉద్యోగాలు మినహా ఇతర విభాగాల్లో కొత్త నియామకాలను నిలిపివేసింది. మరోవైపు, ప్రొడక్ట్ హెడ్, సేల్స్ హెడ్ వంటి కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు సంస్థ నుంచి వైదొలుగుతుండటం కూడా ఎస్‌ఎపి లో జరుగుతున్న మార్పులను సూచిస్తోంది.


గత మూడేళ్ల వ్యవధిలో ఎస్ఎపి చేపట్టనున్న రెండో భారీ పునర్ ‌వ్యవస్థీకరణ ఇది. 2024 జనవరిలో కంపెనీ ప్రకటించిన ఉద్యోగాల కోతలో భాగంగా సుమారు 9 వేల నుంచి 10 వేల మంది ఉద్యోగులను తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.10 లక్షల మంది సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, సాధారణంగా జనవరి చివరిలో వార్షిక ఆర్థిక ఫలితాలతో పాటు కీలక నిర్ణయాలను వెల్లడిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజా ఉద్యోగాల కోతపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్