లాపాజ్ : డీజిల్ ధరలను పెంపును వ్యతిరేకిస్తూ బొలీవియా డ్రైవర్స్ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. బొలీవియన్ డ్రైవర్ల ట్రేడ్ యూనియన్ల సమాఖ్య గురువారం లా పాజ్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ' డిక్రీ 5716' ప్రకారం ఇంధన ధరలను పెంచుతూ, నేషనల్ హైడ్రోకార్బన్స్ ఏజెన్సీ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులను ఈ సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకించింది. కేవలం కార్మికులకు న్యాయం జరగాలన్న సామాజిక డిమాండ్ తప్ప ఈ నిరసనకు ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని యూనియన్ అగ్ర నేత లూసియో గోమెజ్ పేర్కొన్నారు. డిక్రీ 5716ని రద్దు చేయాలని, డీజిల్ టారిఫ్‌లను పెంచుతూ తాజా విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని యూనియన్ డిమాండ్ చేసింది. ఈ రెండు డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం డీజిల్ ధరలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మార్పులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న అధ్యక్షుడు రోడ్రిగో పాజల్ ప్రభుత్వ రాయితీని తొలగించారు. దీంతో తక్కువ ధరకే ఇంధనం లభించే అవకాశం లేకుండా పోయింది. కేవలం పది నెలల వ్యవధిలోనే ప్రభుత్వం మూడుసార్లు ధరను పెంచింది. దీంతో లీటర్ డీజిల్ ధర సుమారు 4 బొలీవియన్ పెసోల (0.34 డాలర్లు/ రూ.31.62) నుండి ప్రస్తుతం 20.57 పెసోలకు చేరింది. ఈ మొత్తం పెంపు 400శాతానికి పైగా ఉంది. ఈ పెంపు కార్మిక కుటుంబాలకు భారం కానుందని ప్రభావం కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. రవాణా రంగం, వేతన వివాదంతో పాటు ఇతర నిర్మాణాత్మక సమస్యలను కూడా కార్మిక సంఘాలు జతచేశాయి. క్షీణిస్తున్న రహదారి వ్యవస్థ, దీంతో తమ వాహనాలకు కలిగే నష్టాలను డ్రైవర్లు పేర్కొన్నారు. తమ వాహనాలను సహజ వాయువుకు మార్చడంలో జాప్యం, టారిఫ్‌లు లేకుండా చూడటం, ఉత్పాదక రుణాలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఫోంగాట్ అని పిలిచే క్రెడిట్ గ్యారెంటీ ఫండ్‌కు సంబంధించిన వైఫల్యాలను కూడా వారు ఖండిస్తున్నారు.







కామెంట్‌లు (0)