భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల విశ్వసనీయతకు పునాది పారదర్శకత. దానికి నిట్టనిలువునా పాతర వేసి, ఏకపక్షంగా వ్యవహరించే ధోరణికి బిజెపి ప్రభుత్వం తలుపులు తెరిచింది. ఎన్నికల కమిషనర్ల నియామకం మొదలుకొని ఎన్నికల నిర్వహణ దాకా అడ్డగోలుగా సాగుతోంది. దరిమిలా నిష్పాక్షికంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తుందని చెప్పటానికి అనేక ఉదాహరణలూ, ఉదంతాలూ ఉన్నాయి. వీటిపై ఇప్పటికే తీవ్ర ఆందోళనలు సాగుతుండగా, తాజాగా 'రిపోర్టర్స్ కలెక్టివ్' వెల్లడించిన పరిశోధన ఎన్నికల నిర్వహణలో లోపాలను, అవకతవకలను మరింతగా బట్టబయలు చేసింది. ఎన్నికల సంఘం ఈ స్థాయిలో అపనమ్మకాన్ని, అధికార పక్షపాతాన్ని, బాధ్యతారాహిత్యాన్ని మూట కట్టుకోవటం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేదు.
ప్రజల ఓట్లు సక్రమంగా నమోదయ్యాయా? పోలైన ఓట్లన్నీ లెక్కలోకి వచ్చాయా? పోలింగ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు నిబంధనలు పాటించారా? అనే ప్రశ్నలకు ఎన్నికల సంఘం ఆధారాలతో సమాధానం చెప్పగలగాలి. కానీ, ఎన్నికల నిర్వహణలో కీలకమైన రికార్డులను సరిగా నిర్వహించలేకపోవడం, వాటిలో తేడాలు బయటపడితే వివరణ ఇవ్వకుండా సమాచారాన్ని దాచిపెట్టటం ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 'రిపోర్టర్స్ కలెక్టివ్' 2024 ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ-కశ్మీర్‌లలోని 530 లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల నివేదికలను పరిశీలించింది. 4,212 భౌతిక రికార్డులను డిజిటలైజ్ చేసి విశ్లేషించింది. ఈ పరిశోధనలో 51 నియోజకవర్గాల్లో ఓట్ల నమోదు, లెక్కింపునకు సంబంధించిన వ్యత్యాసాలు బయటపడ్డాయి. వీటిలో 19 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్ల సంఖ్య నమోదు చేయాల్సిన చోట అధికారులు సున్నా లేదా నిల్ అని రాశారు. మరో 32 నియోజకవర్గాల్లో నమోదైన ఓట్లకు, ఈవీఎంలలో లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసాలు కనిపించాయి. వీటికి కారణాలేమిటో, ఎలా పరిష్కరించారో ఎక్కడా నమోదు చేయలేదు. సాధారణంగా పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఓటరు వివరాలను ఫారం 17ఎ లో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలో నమోదైన ఓట్ల వివరాలను ఫారం 17సి లో పొందుపరుస్తారు. ఈ రెండు రికార్డుల్లోనూ సంఖ్య సమానంగా ఉండాలి. తేడాలు ఉంటే అందుకు కారణాలను నిర్ధారించడం అధికారుల బాధ్యత. కానీ, ఆ 51 నియోజకవర్గాల్లో అలాంటి చర్యలేవీ లేకపోవడం ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నార్థకం చేస్తోంది. హర్యానాలోని బడ్ఖల్ లోక్‌సభ నియోజకవర్గంలో 3.32 లక్షల ఓట్లు పోలైనట్లు అంతర్గత రికార్డుల్లో నమోదు కాగా, ఈవీఎంలో నమోదైనవి 1.60 లక్షలేనని 'రిపోర్టర్స్ కలెక్టివ్' పేర్కొంది. ముంబై నార్త్‌లోనూ 18.11 లక్షల ఓట్లు పోలైనట్లు రికార్డుల్లో ఉండగా, ఈవీఎంలో నమోదైనవి 10.33 లక్షలేనని వెల్లడించింది. అయితే ఈ రెండు చోట్లా మొత్తం ఓటర్ల సంఖ్యను పొరపాటున ఓటు వేసినవారి సంఖ్యగా నమోదు చేశారని అధికారులు వివరణ ఇచ్చారు. ఇంత తీవ్రమైన పొరపాట్లు ఎలా చోటుచేసుకున్నాయి? వాటిని పరిశీలించాల్సిన యంత్రాంగం ఏం చేసింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. హర్యానాలోని కైతాల్‌లో 215 మంది మాత్రమే ఓటు వేసినట్లు రికార్డులో ఉండగా, ఈవీఎంలో 1,67,285 ఓట్లు లెక్కించినట్లుగా ఉంది.
2019 సార్వత్రిక ఎన్నికల వరకు పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల వివరాలను ఎన్నికల సంఘం బహిరంగపరిచేది. ఆ తర్వాత ఈ విధానాన్ని నిలిపివేసింది. 2024 ఎన్నికల సందర్భంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ఫారం 17సి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరగా, ఎన్నికల సంఘం నిరాకరించింది. అభ్యర్థులు, వారి ఏజెంట్లకు తప్ప ఇతరులకు అందించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టులో వాదించింది. ఓటు హక్కు వినియోగం, దాని లెక్కింపు ప్రజలకు సంబంధించిన అంశమైనప్పుడు ఆ వివరాలు వారికి ఎందుకు తెలియకూడదో అర్థం కాదు. ఈ దాపరికానికి కేంద్రంలోని మోడీ–షా ప్రభుత్వ చర్యలు మరింత బలం చేకూర్చాయి. 2024 డిసెంబర్ 20న కేంద్ర న్యాయశాఖ ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 93(2)(ఎ)ను సవరించింది. గతంలో ప్రజలు పరిశీలించేందుకు వీలుగా ఉన్న ఎన్నికల పత్రాల పరిధిని కుదించింది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల పర్యవేక్షణకు అవకాశం కల్పించాల్సిన సమయంలో, సమాచారాన్ని పరిశీలించే పరిధినే పరిమితం చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం.
ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఓటర్ల పేర్ల తొలగింపులు, పోలింగ్ శాతం వివరాల ప్రకటనలో జాప్యం వంటి అంశాలపై ఇప్పటికే అనేక అనుమానాలూ, విమర్శలూ, ఫిర్యాదులూ ఉన్నాయి. ఎన్నికల సంఘానికి ఉన్న స్వతంత్రత, అధికారాలు ప్రజల విశ్వాసాన్ని కాపాడటానికే తప్ప, తన పనితీరును ప్రజల ప్రశ్నలకు అతీతంగా ఉంచడానికి కాదు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు పాతర వేయటానికి కారణంగా మోడీ–షా వైపు దేశయువత చూస్తోంది. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. రిటర్నింగ్ అధికారుల నివేదికలు, పోలింగ్ కేంద్రాల ఫారం 17ఎ, ఫారం 17సి వివరాలను అందుబాటులో ఉంచాలి. తమ ఓటు ఎలా నమోదైంది, ఎలా లెక్కించబడిందో తెలుసుకోవడం ప్రజల హక్కు. ఓటు విలువను, ప్రాధాన్యాన్ని కాపాడాల్సిన సంస్థ తన పనితీరుపై ప్రజలకు అపనమ్మకం కలిగించే స్థితికి చేరడం విచారకరం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.






కామెంట్లు (0)