శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనీటి ప్రైవేటీకరణకే..

6 నిమిషాల క్రితం

c78d383d-fcbb-4d25-a91f-001e5fb7023a.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 05:34 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

  • వాటర్ రెగ్యులేటరీ కమిషన్

ప్రకృతి ప్రసాదించిన నీటిని కూడా లాభాల కోసం అమ్ముకునే వ్యాపార వస్తువుగా మార్చే రోజులు రాబోతున్నాయా? ప్రజలందరికీ అందాల్సిన జీవనాధారాన్ని డబ్బున్నవారి అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేసే వ్యవస్థను నిర్మించబోతున్నారా? రాష్ట్రంలో వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా ప్రతిపాదన ఇటువంటి ప్రశ్నలను ముందుకు తెచ్చింది. విద్యుత్, పోర్టుల రంగాల్లో అమలు చేసిన సంస్కరణల తరహాలోనే నీటి రంగంలోనూ నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచన వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాలను పరిశీలించాల్సిన అవసరముంది. ప్రజల ఉమ్మడి సంపదగా ఉండాల్సిన నీటిని కార్పొరేట్ సంస్థలకు ఆదాయ వనరుగా మార్చే ప్రమాదం పెరుగుతున్నది. ప్రపంచ బ్యాంకు ఆదేశాలలో భాగంగా తాగు, సాగునీటి వనరులకు మీటర్లు ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్‌ ‌మిషన్‌ ‌పేరుతో రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం 160 జీవో ద్వారా అమలుకు ప్రయత్నించింది.

నవంబర్ 11న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి విద్యుత్ నియంత్రణ మండలి తరహాలో వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.632 కోట్లతో 789 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి 7.49 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, జలవనరుల శాఖ పరిధిలోని 4,171 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 903 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం వంటి కార్యక్రమాలను ప్రకటించారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణను జలహారతి కార్పొరేషన్‌కు అప్పగించాలని సూచించారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుదుత్పత్తి, రవాణా రంగాలకు నీటి కేటాయింపులపై ప్రతిపాదిత కమిషన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, సాగునీటి వనరుల అభివృద్ధి, విద్యుత్ ఉత్పత్తి పెంపుదల అవసరమైన చర్యలే. అయితే వీటితోపాటు నీటి కేటాయింపులను, వినియోగాన్ని నియంత్రించే ప్రత్యేక కమిషన్ ప్రతిపాదనను ముందుకు తేవడం వెనుక ప్రభుత్వ విధానపరమైన లక్ష్యమేమిటి? నీటి నిర్వహణలో సామర్థ్యాన్ని పెంచడమా? లేక వినియోగదారుల నుంచి మరింత ఆదాయం వసూలు చేయడానికి, ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలు కల్పించడానికి రంగం సిద్ధం చేయడమా? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అంశమిది.

విద్యుత్ రంగ సంస్కరణల అనుభవం

1991లో ప్రారంభమైన ఆర్థిక సరళీకరణ విధానాల తర్వాత ప్రభుత్వ విద్యుత్ బోర్డులను ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ సంస్థలుగా విభజించారు. ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలు కల్పించారు. పోటీ పెరిగితే విద్యుత్ ధరలు తగ్గుతాయని, నాణ్యమైన సేవలు అందుతాయని ప్రచారం చేశారు. అందుకు భిన్నంగా ​ ప్రభుత్వ బ్యాంకుల రుణాలు, ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ఆధారంగా ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు వ్యాపారాన్ని విస్తరించుకున్నాయి. ఈ ఒప్పందాలు ప్రభుత్వాలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపాయి. మహారాష్ట్రలో ఎన్రాన్‌ కంపెనీతో కుదుర్చుకున్న దభోల్ విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం ఇందుకు ఉదాహరణ. విద్యుత్ నియంత్రణ కమిషన్‌ ‌ముసుగులో విద్యుత్ ధరల పెరుగుదల, కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటూ ప్రజలపై వేల కోట్ల భారాలు వేసిన అనుభవం కళ్ల ముందే వుంది.

పోర్టుల రంగంలోనూ ప్రభుత్వ మౌలిక సదుపాయాలపై ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం పెరుగుతున్నది. అదానీ వంటి భారీ కార్పొరేట్ సంస్థలు పోర్టుల నిర్వహణలో విస్తృతమైన వ్యాపార ప్రయోజనాలను సంపాదించుకున్నాయి. ఇప్పుడు నీటి వనరుల నిర్వహణలో కూడా ఇదే తరహా విధానాలు ప్రవేశిస్తే ప్రజల ఉమ్మడి సంపదపై కార్పొరేట్ సంస్థల పట్టు పెరిగే అవకాశం ఉంది.

మహారాష్ట్ర అనుభవం ఏం చెబుతోంది?

నీటి నియంత్రణ కమిషన్ అనేది కొత్త ఆలోచన కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం 2005లో మహారాష్ట్ర వాటర్ రిసోర్సెస్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసింది. నీటి కేటాయింపులు, వినియోగ హక్కులు, వివిధ రంగాలకు నీటి చార్జీల నిర్ణయం వంటి అధికారాలను ఈ సంస్థకు కల్పించింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పరిపాలన, మరమ్మతుల ఖర్చులను నీటి చార్జీల ద్వారా తిరిగి వసూలు చేయాలనే సూత్రాన్ని చట్టంలో పొందుపరిచారు. ఈ విధానంలోని ఆర్థిక దృక్పథాన్ని గమనించాలి. ప్రజల పన్నులతో నిర్మించిన జలాశయాలు, కాలువలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ వ్యయాన్ని వినియోగదారుల నుంచే రాబట్టాలనే సూత్రానికి ప్రాధాన్యం పెరిగితే చిన్న, సన్నకారు రైతులపై అదనపు భారం పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు పెరిగి రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతాయి.

నీటి వనరుల నిర్వహణకు ఖర్చు అవుతుందనేది వాస్తవం. అయితే ఆ ఖర్చును పూర్తిగా వినియోగదారులపై మోపాలా? వ్యవసాయానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని తగ్గించాలా? పారిశ్రామిక సంస్థలు, సాధారణ ప్రజలు ఒకే ప్రాతిపదికన నీటి ధరలు చెల్లించాలా? ఇటువంటి అంశాల్లో సామాజిక న్యాయం కంటే ఆర్థిక రాబడికే ప్రాధాన్యం ఇస్తే నీటి పంపిణీలో పెరిగే అసమానతలు ఆర్థిక, సామాజిక అసమానతలను మరింత పెంచుతాయి.​

ప్రపంచ అనుభవం హెచ్చరిస్తోంది​

బ్రిటన్‌లో 1989లో ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థను ప్రైవేటీకరించారు. ప్రైవేట్ నీటి కంపెనీలను నియంత్రించడానికి ఆఫ్‌వాట్ అనే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేశారు. కంపెనీల పెట్టుబడులు, సేవల ప్రమాణాలు, వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ నీటి కంపెనీల అప్పులు, పర్యావరణ కాలుష్యం, వినియోగదారుల బిల్లుల పెరుగుదల, వాటాదారులకు చెల్లించిన భారీ డివిడెండ్లపై తీవ్రమైన వివాదాలు తలెత్తాయి. 2025లో బ్రిటన్ పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నీటి కంపెనీల పనితీరుపై ప్రజల విశ్వాసం తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొంది. అదే ఏడాది నీటి రంగంపై నియమించిన స్వతంత్ర కమిషన్ మౌలిక సంస్కరణలను సిఫార్సు చేసింది. ఆఫ్‌వాట్ స్థానంలో కొత్త నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన ప్రజల ప్రయోజనాలు రక్షించబడవని ఈ అనుభవం తెలియజేస్తోంది. నీటి సరఫరాలో లాభాలే ప్రధాన లక్ష్యంగా మారినప్పుడు వినియోగదారుల హక్కులు, పర్యావరణ పరిరక్షణ, సేవల నాణ్యత వెనుకబడే ప్రమాదం ఉంది.

తాగునీటినీ వ్యాపారంగా మార్చిన విధానాలు

ఒకప్పుడు గ్రామాల్లో బావులు, చెరువులు, బోర్లు, పంచాయతీ కొళాయిల ద్వారా ప్రజలకు నీరు అందేది. కాలక్రమేణా భూగర్భ జలాల కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు, నీటి వనరుల సంరక్షణలో ప్రభుత్వాల వైఫల్యాలు ప్రజలను ప్రత్యామ్నాయ తాగునీటి వనరులవైపు నెట్టాయి. దీంతో ఆర్వో వాటర్, బాటిల్ వాటర్ పేరుతో భారీ వ్యాపార మార్కెట్ ఏర్పడింది. సురక్షితమైన తాగునీటి కోసం శుద్ధి ప్రక్రియ అవసరమే. కలుషిత నీటిని తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. కానీ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి, ప్రతి కుటుంబం సొంత ఖర్చుతో నీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితిని సృష్టించడం సమర్థనీయం కాదు. ప్రకృతి ప్రసాదించిన నీరు కూడా ఇప్పుడు అనేక కుటుంబాలకు నిత్య ఖర్చుగా మారింది. ఒకవైపు నీటి వనరుల కాలుష్యాన్ని అరికట్టడంలో వైఫల్యం, మరోవైపు శుద్ధి చేసిన నీటిని వ్యాపార వస్తువుగా మార్చడం జరుగుతోంది.

​ ప్రజల సొమ్ముతో నిర్మాణాలు... కార్పొరేట్లకు లాభాలా?

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, సౌర విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు, భూములు, మౌలిక సదుపాయాలు వినియోగించబడతాయి. ఈ ప్రాజెక్టుల నిర్వహణలో భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి పాత్ర కల్పిస్తారనేది కీలకమైన అంశం. ​ప్రభుత్వ పెట్టుబడులతో నిర్మించిన ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు దీర్ఘకాలిక ఒప్పందాలపై అప్పగించడం, వాటి నిర్వహణ ఖర్చులను ప్రజల నుంచి వసూలు చేయడం, ఆదాయంలో ప్రధాన భాగాన్ని కార్పొరేట్ సంస్థలు పొందడం వంటి విధానాలు అమలైతే ప్రజల సొమ్ముతో ప్రైవేట్ లాభాలను పెంచినట్లవుతుంది. ​భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం పరిధిలో సురక్షితమైన నీటిని పొందే హక్కును న్యాయవ్యవస్థ గుర్తించింది. రాజ్యాంగంలోని 39(బి) అధికరణం సమాజంలోని భౌతిక వనరుల పంపిణీ ఉమ్మడి మేలుకు ఉపయోగపడేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని నిర్దేశిస్తోంది. నీటి వనరుల నిర్వహణలో ఈ రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిబింబించాలి.

ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వాటర్ రెగ్యులేటరీ కమిషన్‌కు నీటి ధరలు నిర్ణయించే అధికారం ఉంటుందా? సాగునీటిపై కొత్త చార్జీలు విధిస్తారా? తాగునీటి సరఫరాపై దాని ప్రభావం ఏమిటి? పారిశ్రామిక సంస్థలకు నీటి కేటాయింపుల్లో ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు? రైతు సంఘాలు, స్థానిక సంస్థలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం ఉంటుందా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ఇప్పటివరకు కమిషన్ ఏర్పాటుపై అధ్యయనానికి మాత్రమే ఆదేశాలు ఇచ్చారు. దాని అధికారాలు, ధరల నిర్ణయ విధానం, ప్రైవేట్ సంస్థల పాత్రపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు. అందువల్ల ప్రభుత్వం ముందుగా ప్రతిపాదిత కమిషన్‌కు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని, సాధ్యాసాధ్యాల నివేదికను బహిరంగపరచాలి. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, స్థానిక సంస్థలు, ప్రజాసంఘాలతో చర్చించాలి.

నీటి నిర్వహణలో సామర్థ్యం పెంచడం, వృథాను అరికట్టడం, జలాశయాలను సంరక్షించడం, కాలువలను ఆధునీకరించడం అవసరం. అయితే ఈ లక్ష్యాల సాధనకు నీటిని మార్కెట్ శక్తులకు అప్పగించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ బాధ్యతను బలోపేతం చేయడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, శాస్త్రీయ ప్రణాళికతో నీటి వనరులను వినియోగించడం ద్వారానే దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధ్యమవుతాయి. నీరు కేవలం ఆర్థిక వనరు కాదు. మానవ మనుగడకు ఆధారం. వ్యవసాయానికి జీవనాడి. ప్రజల ఆరోగ్యానికి, ఆహార భద్రతకు పునాది. అటువంటి సహజ వనరును లాభనష్టాల లెక్కలతో మాత్రమే చూడటం సామాజిక న్యాయానికి విరుద్ధం.

టిడిపి కూటమి ప్రభుత్వం నిజంగా జలహారతి ఇవ్వాలనుకుంటే ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు, ప్రతి రైతుకు అవసరమైన సాగునీరు అందించాలి. చెరువులు, కాలువలు, జలాశయాలను సంరక్షించాలి. నీటి వనరులపై ప్రజల హక్కులను బలోపేతం చేయాలి. ​నీటిపై హక్కు ప్రజలది. దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజల జీవనాధారాన్ని కార్పొరేట్ సంస్థల లాభార్జనకు సాధనంగా మార్చే ప్రయత్నాలను ప్రజలు అప్రమత్తంగా ఎదుర్కోవాలి.

k murali.jpg

వ్యాసకర్త :కందారపు మురళి
సి.ఐ.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్