రాత్రికి రాత్రే 23 కి.మీ. వెనక్కి వెళ్లిన సముద్రం.. వైరల్ వీడియోల వెనుక అసలు నిజం !
బ్యూనస్ ఎయిర్స్ : సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయింది.. సముద్రపు నేల బయటపడింది.. అక్కడక్కడా పడవలు, చేపలు కనిపిస్తున్నాయి.. దీంతో ‘అర్జెంటీనాలో సముద్రం ఎండిపోయింది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు చూసి ప్రకృతి విపత్తు వచ్చిందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ నిజంగానే సముద్రం ఎండిపోయిందా ? వైరల్ అవుతున్న వీడియోల్లో నిజమెంత ? తెలుసుకుందాం...
నీరు వెనక్కి వెళ్లిన మాట వాస్తవమే..
అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్‌లో ఉన్న మార్ డెల్ ప్లాటా తీరంలో సముద్రపు నీటిమట్టం అనూహ్యంగా తగ్గింది. కొన్ని వీడియోల్లో సముద్రం సుమారు 23 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లినట్లు కనిపించింది. నీరు తగ్గిపోవడంతో సాధారణంగా అలల కింద కనిపించని సముద్రపు నేల, రాతి నిర్మాణాలు బయటపడ్డాయి. అక్కడ ఉన్న పడవలు కూడా నీరు లేని ప్రాంతంలో కనిపించాయి. కొన్ని చేపలు చనిపోయి కనిపించడంతో ఈ దృశ్యాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. దీంతో ‘సముద్రం ఎండిపోయింది’, ‘ఇది ప్రకృతి విపత్తుకు సంకేతం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే సముద్రం శాశ్వతంగా ఎండిపోలేదు. అర్జెంటీనా జాతీయ మీడియా సంస్థ దీనిపై వివరణ ఇస్తూ .... ఇది తాత్కాలికంగా నీటిమట్టం తగ్గిన సహజ సిద్ధమైన పరిణామమని తెలిపింది. కొన్ని గంటల తర్వాత సముద్రపు నీరు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది.
బలమైన గాలుల ప్రభావం ....
సముద్ర శాస్త్ర నిపుణుల ప్రకారం ... ఒకే దిశలో బలమైన గాలులు నిరంతరం వీచినప్పుడు సముద్రపు నీరు తీరానికి దూరంగా నెట్టబడుతుంది. ఈ ప్రక్రియను ‘విండ్ సెట్‌డౌన్’ అని పిలుస్తారు. వాతావరణ పరిస్థితులు, గాలుల దిశ, వేగం, సాధారణ ఆటుపోట్ల ప్రభావం వంటి అంశాలు కలిసి నీటిమట్టం తాత్కాలికంగా గణనీయంగా తగ్గడానికి కారణమవుతాయి. నీరు వెనక్కి వెళ్లడంతో సాధారణంగా సముద్రపు అడుగున దాగి ఉండే రాళ్లు, ఇసుక ప్రాంతాలు, ఇతర నిర్మాణాలు బయటకు కనిపిస్తాయి. దీంతో సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లిపోయినట్లుగా దృశ్యం కనిపిస్తుంది.
సునామీకి దీనికి సంబంధం ఉందా ?
సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడంతో సునామీ వస్తుందేమోనని కొందరు భయపడ్డారు. అయితే అర్జెంటీనాలో జరిగిన పరిణామాన్ని సునామీతో పోల్చడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా సముద్ర గర్భంలో భూకంపాలు వంటి భారీ భౌగోళిక కదలికలు సంభవించినప్పుడు సునామీ ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో సునామీకి ముందు సముద్రపు నీరు అకస్మాత్తుగా వెనక్కి వెళ్లి.. ఆ వెంటనే భారీ అలలు తీరాన్ని తాకుతాయి. అయితే ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం. గాలులు, ఆటుపోట్ల ప్రభావంతో నీటిమట్టం తాత్కాలికంగా తగ్గడం.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే నీరు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం జరిగింది.
మరి వైరల్ వీడియోల సంగతేంటి ?
వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాలు వాస్తవమైనవే. అయితే ‘అర్జెంటీనాలో సముద్రం ఎండిపోయింది’ అనే ప్రచారం మాత్రం తప్పుదారి పట్టించేదిగా ఉంది. సముద్రం శాశ్వతంగా కనుమరుగవ్వలేదు. ఇది ప్రకృతిలో అప్పుడప్పుడు చోటుచేసుకునే తాత్కాలిక నీటిమట్టం తగ్గుదల మాత్రమే.
కాబట్టి.. వైరల్ వీడియోలు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్జెంటీనాలో సముద్రం ఎండిపోలేదు.. సహజ ప్రక్రియలో భాగంగా కొంతకాలం నీరు వెనక్కి వెళ్లింది అంతే.







కామెంట్‌లు (0)