యూరప్ : శీతల వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఐరోపా ఖండం ప్రస్తుతం తీవ్ర ఎండలు, వడగాల్పులతో సతమతమవుతోంది. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు కేవలం మూడు నెలల వ్యవధిలోనే వడగాల్పుల కారణంగా యూరప్‌లో 50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
మరణించిన వారిలో సుమారు 32,600 మంది శిలాజ ఇంధనాల వినియోగం వల్ల వెలువడే కాలుష్యంతో ముడిపడిన వాతావరణ మార్పుల ప్రభావానికి బలైనట్లు తెలిపారు. బ్రిటన్‌లోనే ఈ వేసవిలో 4,354 మంది మరణించినట్లు వెల్లడించారు. మృతుల్లో అధిక సంఖ్యలో వృద్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లోనూ అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న శాస్త్రవేత్తలు ....
ఈ ఏడాది ఐరోపా ఎదుర్కొంటున్న వడగాల్పులు అత్యంత తీవ్రంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణ మార్పుల ముప్పును ముందుగానే అంచనా వేసి, తగిన నివారణ చర్యలు చేపట్టడంలో వైఫల్యం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని అభిప్రాయపడుతున్నారు.
ఐరోపా దేశాలు పరస్పర సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సహారా ఎడారి నుంచి ఉత్తర దిశగా కదిలే వేడి గాలులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా యూరప్‌లో ‘హీట్‌డోమ్’ పరిస్థితులు ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ పరిణామంతో వేడి గాలి ఒక ప్రాంతంలోనే చిక్కుకుపోయి, ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
వాతావరణ మార్పుల ప్రభావం క్రమంగా తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వడగాల్పులపై ముందస్తు హెచ్చరికలు, ప్రజలకు అవగాహన, వృద్ధులు సహా ప్రమాదానికి గురయ్యే వర్గాలకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడం అత్యవసరమని స్పష్టం చేస్తున్నారు.








కామెంట్‌లు (0)