అమెరికా : రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, ఎపిఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే తన పోలీసు సర్వీసు నుంచి పదవీ విరమణ చేశారు. బాలసుబ్రహ్మణ్యం మృతి పోలీసు వర్గాల్లో విషాదాన్ని నింపింది.
బాలసుబ్రహ్మణ్యం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన ఈ ఏడాది ఆగస్టు 30న ఐపిఎస్‌గా పదవీ విరమణ చేశారు. ఆయన భౌతికకాయాన్ని మరో మూడు రోజుల్లో అమెరికా నుంచి హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాలసుబ్రహ్మణ్యం మృతిపై తెలంగాణ మాజీ డీజీపీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాప సందేశం విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ విభాగంలో కలిసి పనిచేసిన రోజులను అంజనీ కుమార్ గుర్తుచేసుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం ఎంతో తెలివితేటలు, నిబద్ధత, ధైర్యసాహసాలు కలిగిన అధికారిగా పనిచేశారని కొనియాడారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేయడానికి అవసరమైన సహనం, అంకితభావం, గోప్యతను ఆయన సమర్థంగా పాటించారని పేర్కొన్నారు. ఆయన నివేదికలు, విశ్లేషణలు, క్షేత్రస్థాయి పనితీరు రాష్ట్ర భద్రతకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. ఉన్నతాధికారులకు నమ్మకమైన అధికారిగా, జూనియర్లకు ఆప్యాయత కలిగిన వ్యక్తిగా, సహచరులకు మంచి స్నేహితుడిగా బాలసుబ్రహ్మణ్యం గుర్తింపు పొందారని అంజనీ కుమార్ పేర్కొన్నారు. అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసమే ఆయన యూనిఫాం ధరించారని కొనియాడారు. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను, పోలీసు శాఖలోని ఎంతోమంది సహచరులను ఆయన వదిలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌తో పోరాటంలోనూ విధి నిర్వహణలో చూపిన అదే నిబ్బరాన్ని ప్రదర్శించారని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు.








కామెంట్‌లు (0)