శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జడ్జిలను లక్ష్యంగా చేసుకునే నిరసనలకు అనుమతివ్వవద్దు : మద్రాస్‌ హైకోర్టు

1 గంట క్రితం

Madras HC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 12:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : జడ్జిలను బెదిరించే, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకునే బహిరంగ సభలకు లేదా ప్రదర్శనలకు అనుమతి ఇవ్వవద్దని మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఒకవేళ అనుమతి పొందిన సభ జడ్జీలపై వ్యక్తిగత దాడులకు పాల్పడితే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్‌ జస్టిస్‌ సుశ్రుత్‌ అరవింద్‌ ధర్మాధికారి, జస్టిస్‌ జి. అరుల్‌ మురుగన్‌లతో కూడిన మొదటి డివిజన్‌ బెంచ్‌ తమిళనాడు పోలీసులను ఆదేశించింది. న్యాయపరమైన అంశాలకు సంబంధించి బహిరంగ సమావేశాలు, ప్రదర్శనలు, నిరసనలకు అనుమతి కోరుతూ వచ్చే అన్ని దరఖాస్తులను, బిఎన్‌ఎస్‌ఎస్‌, స్థానిక పోలీస్ చట్టం కింద తమకు లభించిన అధికారాలను ఉపయోగించి, ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర పోలీసులు, జిల్లా యంత్రాంగం నిరంతరం సమీక్షించాలని ధర్మాసనం ఆదేశించింది. జడ్జిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకునే, బెదిరింపులకు దిగే ఏ బహిరంగ సభకు, ప్రదర్శనకు అనుమతి ఇవ్వరాదని పేర్కొంది. అనుమతి పొందిన సభ వ్యక్తిగత దాడిగా మారితే , సంబంధిత అధికారులు వెంటనే ఆ కార్యక్రమాన్ని నిలిపివేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

న్యాయవ్యవస్థను కించపరిచే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నైకి చెందిన ఆర్‌. కార్తికేయన్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. మతం మార్చుకున్న ముస్లింలకు రిజర్వేషన్లకు అర్హత లేదని జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చిన అనంతరం, తమిళనాడు తౌహీద్ జమాత్, తమిళనాడు ముస్లిం మున్నేట్ర కజగం చేపట్టిన నిరసనలను పిల్‌ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చింది. న్యాయవ్యవస్థ అధికారాన్ని కించపరిచే, భయపెట్టే లేదా బలహీనపరిచే వ్యవస్థీకృత ప్రచారాలు, బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, ప్రసంగాలు, సోషల్ మీడియా ప్రచురణలు, ఇతర కార్యకలాపాలపై సమర్థవంతమైన నివారణ, శిక్షా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్