ఢాకా : అధికారం నుండి తొలగించబడిన ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తే ఆమెను జైలుకు పంపుతామని విదేశాంగశాఖ సహాయమంత్రి సోమవారం తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఆమె తిరిగి బంగ్లాదేశ్‌కు రానున్నారన్న వార్తలపై ఆయన స్పందించారు. షేక్ హసీనా లొంగిపోతే, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఆమె జైలుకు వెళ్లాల్సివుంటుందని విదేశాంగశాఖ సహాయమంత్రి షమా ఒబేద్ ఇస్లాం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె భారత్‌లో లేదా బంగ్లాదేశ్‌లో ఎక్కడ లొంగిపోయినా, జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆమెకు శిక్ష విధించారని, శిక్ష పడిన వ్యక్తి వాంగ్మూలాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాఖ్యల విషయంలో ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తీర్పు వెలువడినప్పటి నుండి, ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరుతోందని అన్నారు. ఈ ప్రక్రియ గత మధ్యంతర ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని, ప్రస్తుత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) నేతృత్వంలోని ప్రభుత్వం దానిని కొనసాగిస్తోందని షమా పేర్కొన్నారు. హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన తర్వాత, తదుపరి కార్యాచరణను కోర్టు నిర్ణయిస్తుందని అన్నారు.
హసీనా స్వదేశానికి తిరిగి రావాలనే ప్రణాళికలపై వ్యాఖ్యానిస్తూ, అజ్ఞాతంలోకి వెళ్లిన లేదా దేశం విడిచి వెళ్లిన అవామీ లీగ్ నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. 2024 ఆగస్టు 5న విద్యార్థుల నేతృత్వంలో చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారడంతో ఆమె పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. తన ప్రభుత్వం కూలిపోయిన అనంతరం బంగ్లాదేశ్ నుండి పారిపోయి భారత్‌లో ఆశ్రయం పొందారు.








కామెంట్‌లు (0)