ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సమాజ ప్రగతికి కళలే మూలం

1 గంట క్రితం

babji
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 12:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నిరంకుశత్వాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమే

- సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి : ప్రముఖ సినీ దర్శకులు బాబ్జి

ప్రజాశక్తి- కర్నూలు క్రైమ్ : సమాజ ప్రగతికి కళలే మూలాధారమని ప్రముఖ సినీ దర్శకులు బాబ్జీ అన్నారు. ప్రజానాట్యమండలి 11వ రాష్ట్ర మహాసభ సందర్భంగా కర్నూలు రైతు మార్కెట్ యార్డులో నిర్వహించిన వీధి నాటకోత్సవాలు రెండో రోజూ అత్యంత ఉత్సాహభరింగా, చైతన్యవంతంగా సాగాయి. ముఖ్యఅతిథులుగా ప్రముఖ సినీ దర్శకులు బాబ్జి, తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ కార్యదర్శి, సినీ దర్శకుడు డివి రాజు, సినీనటి విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ సమాజంలోని సమస్యలను కళలు ప్రతిబింబించాలన్నారు. సాధారణంగా ఆయా సంఘాలు తమ రంగం పరిధిలోని సమస్యలను మాత్రమే చర్చిస్తే ప్రజానాట్యమండలి సమాజంలోని అన్ని రంగాల సమస్యలనూ చర్చించి సామాజిక దిక్సూచిగా నిలుస్తోందని కొనియాడారు. దేశంలో నేడు ప్రశ్నిస్తున్న వారిపై ప్రభుత్వాల నిర్బంధం, నిరంకుశత్వం పెరిగిందని, జైళ్లలో సైతం పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల్లో అవలక్షణాలు భారీగా ప్రవేశించాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. సినిమాలు సమాజ నిర్మాణానికి దోహదపడాలని, అది తనకు ప్రజానాట్యమండలి నేర్పించిందని, తన చివరి శ్వాస వరకు ఈ విధానాన్ని అనుసరిస్తానని, భవిష్యత్తులో తన సినిమాలో ప్రజానాట్యమండలి కళాకారులకు అవకాశం కల్పిస్తానన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు రఘుబాబు మాట్లాడుతూ మనిషి బతికున్నంతకాలం కళ బతికే ఉంటుందన్నారు. కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు హర్ష మాట్లాడుతూ ప్రజా కళాకారులకు ప్రభుత్వ ఆదరణ అవసరమన్నారు. ఎస్ అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు.

ప్రభవించిన కళా అభ్యుదయం

వీధి నాటక ఉత్సవాల్లో కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు, ఆలపించిన గీతాలు, నృత్యాల్లో అడుగడుగునా అభ్యుదయం ప్రభవించింది. ప్రజానాట్యమండలి రాష్ట్ర కేంద్రం ఆధ్వర్యంలో ప్రదర్శించిన టామీ టామీ, కర్నూలు జిల్లా కమిటీ వారి పోతులూరి వీరబ్రహ్మం నృత్యరూపకం, డప్పుల నృత్యం, పశ్చిమగోదావరి జిల్లా వారి మన్యం విప్లవం నాటకం, నెల్లూరు జిల్లా వారి ఏ కులం నీది నాటకం అలరించాయి. ఏలూరి వారి ఆజాది డ్యాన్ దేశంలో మతోన్మాదం శక్తులను ప్రశ్నిస్తూ మతసామరస్యాన్ని ప్రతిబింబించింది. పోలవరం జిల్లా వారి అమ్మ పెనుకలు గిరిజన నృత్యం వారి సాంప్రదాయ జానపద కళను ఆవిష్కరించింది. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు మంగరాజు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు కవిరాజు, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు బసవరాజు, ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్