- ఎఐపిఎస్‌ఎన్ ప్రధాన కార్యదర్శి ఆశా మిశ్రా
ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా మహిళలు ఆశించిన వివక్షత లేని సమాజం ఇంకా ఆచరణలోకి రాలేదని ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ (ఎఐపిఎస్‌ఎన్)ప్రధాన కార్యదర్శి ఆశా మిశ్రా అన్నారు. మహిళల సాధికారతకు చట్టాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవడంతో పాటు సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, జెవివి సమత (మహిళా విభాగం) రాష్ట్ర కన్వీనర్ జి.నిర్మల అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌నకు ఆశా మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్షరాస్యత అంటే కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదని, చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే నిజమైన విద్య అని అన్నారు. జెవివి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ పార్లమెంట్‌లోనే లింగ సమానత్వం లోపించిందని, మహిళల ప్రాతినిధ్యం ఇంకా పరిమితంగానే ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆచరణలోకి రావాలంటే మహిళలు చైతన్యవంతంగా ముందుకు రావాలని, చట్టాలు కల్పించిన అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ ఉదయిని మాట్లాడుతూ జీవం ఆవిర్భావానికి శాస్త్రీయ కారణాలే ఆధారమని, డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం అనేక శాస్త్రీయ సత్యాలను ప్రపంచానికి తెలియజేసిందని తెలిపారు. వర్క్‌షాప్‌లో మహిళల సాధికారత, మహిళలకు సంబంధించిన చట్టాలు, విద్య, ఆరోగ్యం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు తదితర అంశాలపై వివిధ వక్తలు ప్రసంగించారు. పిల్లలు వర్ధిల్లాలి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పేస్ ఇంజనీరింగ్ కళాశాల డీన్ సివి సుబ్బారావు, ప్రిన్సిపల్ జివికె మూర్తి, జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, డాక్టర్ కె.కరుణశ్రీ, బి. సృజన, ప్రొఫెసర్ విజయలక్ష్మి, డాక్టర్ విరించితో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)