- కళారూపాలతో పలు ఉద్యమాలకు సహకారం
- ప్రజానాట్య మండలి మహాసభ ప్రతినిధుల అనుభవాలు
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : సమాజ చైతన్యానికి కళను ఆయుధంగా మలుచుకుని ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తున్నామని పలువురు ప్రజానాట్య మండలి (పిఎన్‌ఎం) నాయకులు పేర్కొన్నారు. నాటికలు, కళారూపాలతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని తెలిపారు. కర్నూలులోని సన్యాసిరావు, పెంచలయ్య నగర్లో జరుగుతున్న ప్రజానాట్య మండలి 11వ రాష్ట్ర మహాసభలో వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు తమ అనుభవాలను 'ప్రజాశక్తి`తో పంచుకున్నారు.
పెంచలయ్య ఆశయం కొనసాగుతోంది : విజయ్ కుమార్, నెల్లూరు జిల్లా పిఎన్ఎం కార్యదర్శి
పెంచలయ్య పని తనం నుంచే పిఎన్ఎంకు ఆకర్షితులయ్యారు. కాలనీలో డ్రగ్స్ అమ్మే ముఠా ప్రవేశించి యువతను గంజాయికి అలవాటు చేయడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిని నిలువరిచేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయాలని పెంచలయ్య ప్రయత్నించారు. నాలుగు మూలలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. డ్రగ్స్ బారిన పడిన కొంత మంది యువతను కళారూపాల ద్వారా మార్చారు. దీంతో, కక్షగట్టిన గంజాయి ముఠా కాపుకాసి పెంచలయ్యను హత్య చేసింది. పెంచలయ్య హత్య తరువాత ఐదో రోజే పెంచలయ్య బృందంతో డ్రగ్స్ వద్దు బ్రో నాటికను తయారు చేసి ప్రదర్శనలు ఇచ్చాం. పెంచలయ్యను చంపినా ఆయన ఆశయాలు చంపలేకపోయారు. డ్రగ్స్ లేని సమాజం కోసం పిఎన్ఎం పోరాటం కొనసాగిస్తున్నాం.
‘ఉక్కు సంకల్పం'తో సహకారం : జి.స్టాలిన్, విశాఖపట్నం పిఎన్ఎం నాయకులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఉక్కు సంకల్పం నాటికను రూపొందించి ప్రదర్శనలు ఇచ్చాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జరుగుతున్న పోరాటాలు, దీక్షల్లో గీతాలతో సహకారం అందించాం. మున్సిపల్ కళాకారులను రెగ్యులరైజ్ చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని 'ఉరితాళ్లు` నాటికను ప్రదర్శించాం. బీచ్ లో మద్యం అమ్మకాలను ప్రభుత్వం చేపట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా 'బీచ్ షాక్' నాటికను రూపొందించి ప్రదర్శనలు ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై కళారూపాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.
అల్లూరి జీవితంపై 385 ప్రదర్శనలు : షేక్ వలి, పిఎన్ఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి
అల్లూరి సీతారామరాజు జీవితంపై అట్లూరి మురళి రూపొందించిన చరిత్ర ఆధారంగా 1997లో భీమవరం సమీపంలోని మోగల్లులో 1997లో పది మందికి శిక్షణ ఇచ్చి 'మన్య విప్లవం' నాటికను రూపొందించాం. రెండు బృందాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకూ 385 ప్రదర్శనలు ఇచ్చాం. పాత వాళ్లు పోయినా కొత్త వాళ్లతో ఆ నాటిక ప్రదర్శన కొనసాగిస్తున్నాం. ఆల్లూరి జీవిత చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దేశభక్తి భావాన్ని పెంపొందించాలని కృషి చేస్తున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నాటికను తరువాతి తరాలకు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం.







కామెంట్‌లు (0)