గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Internationally - అంతర్జాతీయంగా నిలిచిన వెబ్‌సైట్లు.. అసలు కారణమిదే !

34 నిమిషాల క్రితం

Websites down globally... here’s the real reason!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 01:09 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఇంటర్నెట్ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభుత్వ, వాణిజ్య సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు నిలిచిపోవడం ఆందోళనకు దారితీసింది. సైబర్ దాడుల ముప్పును నివారించేందుకు, తమ డిజిటల్ వ్యవస్థలను సురక్షితంగా ఉంచేందుకు ఆయా దేశాలు వెబ్‌సైట్లను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంపై దృష్టి సారించాయి.


ఇంతకీ ఈ పరిస్థితికి కారణమేంటంటే ?


పీహెచ్‌పీలో భద్రతా లోపాలు ....

ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్లు, వెబ్‌ అప్లికేషన్ల రూపకల్పనలో విస్తృతంగా ఉపయోగించే ప్రోగ్రామింగ్ భాష పీహెచ్‌పీ (PHP). దీనికి సంబంధించిన కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు ఆగస్టులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కృత్రిమ మేధ (ఎఐ) ఆధారిత నమూనాల సాయంతో సైబర్‌ భద్రతా నిపుణులు ఈ లోపాలను గుర్తించినట్లు పేర్కొంటున్నారు. వీటిని ‘పీహెచ్‌పీ2షెల్‌’ (PHP2Shell)గా వ్యవహరిస్తున్నారు. కాలం చెల్లిన పీహెచ్‌పీ వెర్షన్లను ఉపయోగిస్తున్న సర్వర్లపై ఈ లోపాల ద్వారా హ్యాకర్లు దాడి చేసే ప్రమాదం ఉంది. సర్వర్లలోకి అనధికారికంగా ప్రవేశించి, తమకు నచ్చిన కోడ్‌ను అమలు చేయడంతో పాటు వాటిపై నియంత్రణ సాధించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్లను కొనసాగిస్తున్న వెబ్‌సైట్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.


వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని హెచ్చరిక ...

ఈ భద్రతా సమస్యలపై పీహెచ్‌పీ ఫౌండేషన్ స్పందిస్తూ ... సాఫ్ట్‌వేర్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పినట్లు సమాచారం. ఎఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇలాంటి భద్రతా లోపాలను గుర్తించే అవకాశాలు పెరుగుతాయని, సైబర్‌ ముప్పులను ఎదుర్కొనేందుకు సాంకేతిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది.


అప్రమత్తమైన పలు దేశాలు ....

పీహెచ్‌పీ భద్రతా హెచ్చరికల నేపథ్యంలో అమెరికా, జపాన్‌తో పాటు ఐరోపా, ఆసియాలోని పలు దేశాలు అప్రమత్తమైనట్లు సమాచారం. వెబ్‌సైట్లను తక్షణమే అప్‌డేట్ చేయాలని, అవసరమైతే భద్రతా చర్యలు పూర్తయ్యే వరకు వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్ఎ) హెచ్చరించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియం, జపాన్‌ సహా పలు దేశాల్లోనూ ఇదే తరహా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వెలువడ్డాయి.


మొత్తంగా, సాఫ్ట్‌వేర్‌లోని చిన్నపాటి లోపాలు సైతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ సేవలకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సైబర్‌ దాడులను అడ్డుకోవాలంటే సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం, భద్రతా లోపాలను సకాలంలో గుర్తించి పరిష్కరించడం అత్యంత కీలకంగా స్పష్టమవుతుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్