- ఏడు ప్రైవేటు బస్సులు దగ్ధం
ప్రజాశక్తి- విజయవాడ అర్బన్ : విజయవాడ ఆటో నగర్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడు బస్సులు కాలిపోయాయి. మరమ్మతుల కోసం ఉంచిన బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం...
ఆటో నగర్‌లోని ఓ మెకానిక్ షెడ్డులో మరమ్మతుల కోసం బస్సులను నిలిపి ఉంచారు. ఇందులోని ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు కొద్దిసేపటికి మిగిలిన బస్సులకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఐదు ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గ్యారేజీలో నిలిపి ఉంచిన ఏడు బస్సులు ఈ ప్రమాదంలో దగ్ధం అయ్యాయి. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణమూ నష్టమూ జరగలేదని తెలిపారు.
మెకానిక్ షెడ్ లో బస్సు ఫ్యాబ్రికేషన్ పనులు, మెయింటెనెన్స్ పనులు చేస్తున్నారని అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రసన్న పార్కింగ్ లైన్స్ నుంచి తమకు 12 గంటలకు ఫోన్ వచ్చిందని, ఆటో నగర్ అగ్నిమాపక వాహనంతో పాటు విజయవాడ, కొత్తపేట వాహనాలు కూడా తెప్పించి ఐదు వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చామని చెప్పారు. మూడు బస్సులు పూర్తిగా, నాలుగు బస్సులు పాక్షికంగా దగ్ధమయ్యాయని తెలిపారు. షెడ్డు నిర్వాహకులు సిద్ధూ మాట్లాడుతూ బాడీ, పెయింటింగ్, టీంకరింగ్, ఎలక్ట్రిషియన్ పనులు చేయిస్తుంటామని, రెండు మూడు రోజుల్లో అన్ని డెలివరీ అయ్యేవని, ఒక బస్సులో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నాయని, మొత్తం ఎసి బస్సులు కావడంతో మంటలు వ్యాపించాయని తెలిపారు. ఆటో నగర్ ఐలా మాజీ ఛైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఒక్కో బస్సు సుమారు రూ.40 లక్షల ఉంటుందని, పెయింటింగ్ వేసి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. చుట్టుపక్కల ఉన్నవారు స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.







కామెంట్‌లు (0)