బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఒక రాజకుమారి కథ..!

1 గంట క్రితం

RAJAKUMARI.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 05:58 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

కథలో రాజకుమారి లాంటి జీవితం కాదు ఈ రాజకుమారిది. నల్లగా ఉందని మొదటి భర్త తనను వదిలేశాడు. 14 ఏళ్ల వయసులో జరిగిన ఈ అవమానం నుంచి తను ఇంకా తేరుకోకముందే నాన్న ఆమెకు రెండో పెళ్లి చేశాడు. బాధ్యత లేని భర్త ఆమెను ముగ్గురు బిడ్డలకు తల్లిని చేశాడు. బిడ్డలను పెంచుకోవడం కోసం, సొంత గూడు కట్టుకోవడం కోసం ఆమె ఎన్నో కష్టాలు పడింది. ఇవన్నీ చాలామందికి సర్వసాధారణంగా అనిపిస్తాయి. ఎందుకంటే చాలామంది మహిళలు తమ జీవితంలో ఇలాంటి ఎన్నో ఎదురుదెబ్బలు తింటూనే ఉంటారు. ఆ అవమానాలు, అవహేళనల మధ్యే బతుకుతారు. కానీ, రాజకుమారి నోరు విప్పి తన కష్టాల గురించి, ఎదురైన అవమానాల గురించి మాట్లాడింది. తల్లిదండ్రులను, సమాజాన్ని ఉద్దేశించి సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగింది. తెలుగు బిగ్‌బాస్‌ షో సీజన్‌ 10 కంటెస్టెంట్‌గా ఇటీవల ఆమె పాల్గొన్న ఓ కార్యక్రమం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తూర్పుగోదావరి జిల్లా తోకాడ రాజానగరం గ్రామానికి చెందిన సాధారణ అమ్మాయిని’ అని రాజకుమారి తనను తాను పరిచయం చేసుకుంది. తన జీవితంలో ఎదురైన ప్రతి ఎదురుదెబ్బను ఎంతో ధైర్యంగా వేదికపై చెప్పింది. 10వ తరగతి తరువాత రాజకుమారిని మేనమామకు ఇచ్చి పెళ్లి చేశారు. అందంగా లేదని అతను వదిలేస్తే పుట్టింటికి చేరుకుంది. ఏడాది కూడా తిరక్కుండా రాజకుమారికి వాళ్ల నాన్న రెండో పెళ్లి చేశాడు. బాధ్యత లేని అతను ఇంటిని పట్టించుకోకపోతే చిన్న చిన్న వ్యాపార అవకాశాలు చూపించింది. ఏదీ అతను ఒంటబట్టించుకోలేదు.

‘పిల్లల కోసం బతకాలి. నన్ను నేను మార్చుకోవాలి’ అని నిర్ణయం తీసుకుంది. రంగు పేరుతో అవమానాలు పడిన చోటు నుంచే తన ప్రయాణం మొదలు పెట్టింది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న ఆమె ఇన్‌స్టాలో ‘రాజకుమారి డయానా’ పేరుతో వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఆ వీడియోల కింద కామెంట్లు చాలా దారుణంగా వచ్చేవి. మళ్లీ రంగునే రంగం మీదికి తెచ్చి నీచంగా మాట్లాడేవారు. అయినా రాజకుమారి వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూనే ఉండేది. క్రమంగా తన వీడియోలు వైరల్‌ అయ్యాయి. లక్ష మంది వరకు అనుసరించే స్థాయికి రాజకుమారి చేరుకుంది.

అప్పుడు చాలా బాధేసింది!

ఒకసారి రాజకుమారికి బైక్‌ యాక్సిడెంట్‌ అయి ముఖంలో ఒక పక్క ఎముక నుజ్జునుజ్జయ్యింది. చికిత్స తరువాత గాయాలతో ఉబ్బిపోయిన ముఖంతో ఇంటికి చేరిన ఆమెను చూసి పిల్లలు భయపడి తన దగ్గరకు రాలేదు. ‘నా పిల్లలు నా దగ్గరకు రాకపోయేసరికి చాలా బాధేసింది. పిల్లల కోసమే బతుకుతున్నాను. తట్టుకోలేకపోయా.. యాక్సిడెంట్‌ అయ్యింది. ప్రాణమైతే పోలేదు కదా! చివరి శ్వాస వరకు పిల్లల కోసం, నా కల కోసం నిలబడాలి అనుకున్నా. కోలుకున్నా!’ అని రాజకుమారి చెప్పింది. తను ఎంత దీనస్థితిలో ఉన్నా.. పిల్లల కోసం అమ్మ పడే తపన, ఆరాటం ఆ మాటల్లో ప్రతిధ్వనించింది. జీవితంలో ఎదురైన ఎదురుదెబ్బలకు కుంగిపోయి, తమను తాము కోల్పోతూ, బిడ్డలను కడతేర్చుతున్న ఎందరో తల్లిదండ్రులు రాజకుమారికి ఎదురైన పరిస్థితులు తెలుసుకుంటే తనలా ధైర్యం తెచ్చుకుంటారు. ఆశను కోల్పోకుండా జీవిస్తారు’ అనేలా ఆమె ప్రయాణం ఉంది.

భర్తల గురించి మాట్లాడుతూ.. ‘నిజంగా పెళ్లాన్ని, పిల్లల్ని పెంచే స్థోమత లేని ఎవ్వరైనా సరే పెళ్లి చేసుకోకూడదు. అలాంటివారు పెళ్లి చేసుకుని ఎందుకు వేరే వాళ్ల జీవితాలు నాశనం చేస్తారు! అది నాకు చాలా కోపం’ అని చెప్పింది. ‘ఒకమ్మాయి నిస్సహాయ స్థితిని వాళ్లు అవకాశంగా తీసుకుని లేని మాటలు అంటారు. అడ్డమైన తిట్లు తిడతారు. అదే చేతగానితనం, అదే పౌరుషం ఏదైనా ఒక పని మీద చూపిస్తే ముందుకు వెళతారు’ అని నేను అనుకుంటాను’ అని ఆమె చెప్పిన మాట ఎందరో ఆడపిల్లలు ఎప్పుడో ఒకప్పుడు అనుకునే ఉంటారు. అందుకే రాజకుమారి మాట్లాడిన ఈ వీడియో బయటకు రాగానే ఎంతోమంది తన ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

తల్లిదండ్రుల గురించి కూడా రాజకుమారి మాట్లాడింది. ‘పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులకు వాళ్ల పిల్లవాడు సరిగ్గా లేడని తెలుసు. పెళ్లయితే మారిపోతాడేమో అనుకుంటారు. 30 సంవత్సరాలు మారలేని వాడు పెళ్లయితే ఎలా మారిపోతాడు? అంటే ఇంకొకరి జీవితం నాశనం చేయడమే కదా ఇది! ఎందుకు అలా చేయాలి? అదే వాళ్ల కూతురు అయితే ఇలా చేస్తారా?’ అని ఆమె ప్రశ్నించింది. ఆ మాటలకు కార్యక్రమ హోస్ట్‌ నవదీప్‌ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తరువాత తానే ఇలా చెప్పింది. ‘నాకు ఒక పాప ఉంది. తనకు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. అతనికి కూడా పాప అంటే ప్రాణం. నేను తీసుకునే ఒక నిర్ణయం నా పాపకు తండ్రిని దూరం చేయకూడదు. చిన్నతనంలో తండ్రికి దూరంగా పెరిగిన నాకు ఆ బాధ తెలుసు. ఆ పరిస్థితి నా బిడ్డకు రాకూడదు అనుకున్నాను’ అని చెప్పింది.

తల్లిదండ్రులు ఆడపిల్లల గురించి ఏం ఆలోచించాలి.. అనేదానిపై కూడా రాజకుమారి మాట్లాడింది. ‘పెళ్లి చేసి అత్తాగారింటికి వెళ్లిన ఆడపిల్ల ఎప్పుడైనా ‘నాకు ఈ కష్టం వచ్చింది. ఈ బంధం నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నా’ అని చెప్పినప్పుడు సర్దుకో సర్దుకో అంటారు. ఆ పిల్ల బాధలు భరించలేక ఏదైనా అఘాయిత్యం చేసుకున్నప్పుడు తన శవం పక్కన కూర్చొని ఏడుస్తూ ‘మాకు చెప్పొచ్చు కదా! మేము చూసుకుంటాం కదా! ఎందుకు ఇలా చేశావు’ అంటారు. శవానికి ఇచ్చే భరోసా, బతికి ఉన్న కూతురు వచ్చి అడిగినప్పుడు ఇవ్వొచ్చు కదా! ఒక కూతురు బతికితే తన వెనకాల చాలా మంది కూతుళ్లు బతుకుతారు’ అని చెప్పింది.

బిగ్‌బాస్‌ షోకు వెళ్లకముందు రాజకుమారి ‘భయం’ అనే షార్ట్‌ఫిలిమ్‌లో నటించి ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఈ పురస్కారంతో ప్రతిభకు కొలమానం ఆత్మవిశ్వాసం అని మరోసారి నిరూపించింది. ఈ మొత్తం వీడియో 5 నుంచి 10 నిమిషాల మధ్యలో కట్‌ చేసి సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. మాట్లాడుతున్నంతసేపూ రాజకుమారి ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చలేదు. చాలా ధైర్యంగా మాట్లాడింది. ఎంతో ఆవేదనతో నిండిపోయిన ఆ మాటలు వీడియో బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే ఎంతోమందిని ప్రభావితం చేశాయి. ఆమెను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్న వారి సంఖ్య గంటగంటకూ పెరుగుతూ ఉంది. ఈ షోలో రాజకుమారి గెలవొచ్చు. గెలవకపోవచ్చు. కానీ షోలో పాల్గొనకుండానే ఆమె ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్