నానాటికీ తీసికట్టు నాగంబొట్లు అన్నట్టుగా ఉంది భారతీయ రైల్వేల పరిస్థితి. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటైన మన రైల్వేలో ప్రయాణికులకు ప్రాథమిక సౌకర్యాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం తాండవిస్తుండటం గర్హనీయం. ఇటీవల పార్లమెంట్‌కు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) సమర్పించిన నివేదిక... 12 ఏళ్ల మోడీ సర్కారు పాలనలో రైల్వేల దుస్థితిని తేటతెల్లం చేసింది. 512 స్టేషన్లలో తనిఖీ చేస్తే 458 స్టేషన్లలో.... అంటే 89 శాతం రైల్వే స్టేషన్లలో ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. రైల్వే స్టేషన్ల కొళాయిల తాగునీటిలో ప్రమాదకరమైన ఇ - కోలితోసహా టోటల్ కోలిఫార్మ్స్ బ్యాక్టీరియా ఉందని నిర్ధారణ అయ్యింది.
వందే భారత్ రైళ్లకు జెండా ఊపుతూ... బుల్లెట్ రైళ్ల గురించి ప్రచారం చేస్తూ... అత్యాధునిక సౌకర్యాలు కల్పించామని ఊదరగొడుతున్న మోడీ సర్కారు మార్కు ప్రచారానికి భిన్నంగా క్షేత్రస్థాయి వివరాలున్నాయి. ఎయిర్‌పోర్టుల్లో ఉన్న సౌకర్యాలు రైల్వే స్టేషన్లలో ఎందుకు ఉండవు అని ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో మోడీ చేసిన వ్యాఖ్యలు... రైల్వేల్లో అసౌకర్యాలపై కాగ్ తాజా నివేదిక నేపథ్యంతో దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. మినిమమ్ ఎసెన్షియల్ ఎమెనిటీస్ (ఎంఇఎ) కల్పించాలని కాగ్ 2018లో ఆదేశించినా... ఇప్పటివరకూ 89 శాతం స్టేషన్లలో దారుణ పరిస్థితులున్నాయంటేనే... వాటిపై కేంద్రానిది మొద్దు నిద్రని విదితమవుతోంది. అనేక స్టేషన్లలో తాగునీటికి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయకపోవడం, ఇ-కోలి / కోలిఫార్మ్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నా పట్టించుకోకపోవడం తాగునీటి అమ్మకాలను ప్రోత్సహించేందుకేనన్నది నిజం. ఇక మరుగుదొడ్లు, యూరినల్స్ సౌకర్యం అందుబాట్లో లేకపోవడం, ఉన్నా నిర్వహణ అధ్వానంగా ఉండటం నిత్య అనుభవమే! రైళ్ల కోసం వేచి ఉండటానికి తగినన్ని కుర్చీలు లేకపోవడం, ప్లాట్‌ఫామ్ షెల్టర్లు లేకపోవడం, ఫ్యాన్లు, విద్యుత్ పరికరాలు, వాటర్ కూలర్లు సక్రమంగా పని చేయకపోవడం... లాంటి అంశాలెన్నో ఈ నివేదికలో కాగ్ ఎత్తిచూపింది. వికలాంగులకు సంబంధించి కల్పించాల్సిన ప్రాథమిక సౌకర్యాలు అసంపూర్ణంగా ఉన్నాయని, సైన్ బోర్డులు, సూచికల ఏర్పాట్లులో లోపాలున్నాయని, వీటిని పలు భాషల్లో ప్రదర్శించాలని ఇలా అనేక సూచనలు చేయడంతోపాటు కేంద్రం ఇన్నాళ్లూ...తమ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోని వైఖరినీ ఎండగట్టింది. ఫిర్యాదులపై స్పందనలు నామమాత్రంగా ఉండటం, టైమ్ బౌండ్ యాక్షన్ ప్లాన్ లేకపోవడం... ఇవన్నీ రైల్వేశాఖ దుస్థితికి అద్దం పట్టేవే.
రైళ్లలో ఏటా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ట్రాక్‌ల నిర్వహణ అధ్వానంగా ఉంటోంది. ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో సిబ్బంది కొరత విపరీతంగా పెరిగి, పని ఒత్తిడి పెరిగిపోయింది. చాప కింద నీరులా చార్జీలు పెరుగుతున్నాయి. సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు తదితరులకు రాయితీలను ఎత్తేశారు. వికలాంగులు, రోగులు, విద్యార్థులు తదితరులకిచ్చే రాయితీలలో సింహభాగం కుదించేశారు. ప్రయాణికులందరికీ సబ్సిడీ ఇస్తున్నామని పార్లమెంట్‌లో మంత్రులు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి సరుకుల రవాణా ద్వారా వచ్చే ఆదాయమే రైల్వేలకు ప్రధానం. వాటిని వినియోగించేది దేశ ప్రజలే. అందువల్ల ఈ రాయితీలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చేది సామాన్యులే. ఇక ప్రయాణికులకు ఎంతో ముఖ్యమైన భద్రతనూ కేంద్రం నీళ్లొదిలేసింది. కవచ్‌ను అందుబాట్లోకి తీసుకొచ్చి ప్రమాదాలను అరికడతామని ప్రకటనలివ్వడం మినహా ఇప్పటికీ ప్రధాన మార్గాల్లోనే అనుసంధానం చేయలేకపోయింది. కొత్త ట్రైన్లు వచ్చాయి. కొత్త టెక్నాలజీ వచ్చింది అనే కోణంలో కాకుండా మౌలిక వసతులను ఎంతగా బలోపేతం చేశాం, వాటి నిర్వహణ ఎలా ఉందన్నదీ చూడాలి. ప్రజా రవాణా సంస్థగా రైల్వేది సామాజిక బాధ్యత. ప్రైవేటీకరణతో కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడానికి రైల్వేలను నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం... ప్రయాణికుల సౌకర్యాలపై, భద్రతపై శ్రద్ధ చూపాలి. బాధ్యత వహించాలి.







కామెంట్‌లు (0)