నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధాన రైల్వే ప్రవేశద్వారంగా మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపికైన ఈ స్టేషన్ సాధారణ రైల్వేహాల్ట్ స్థాయి నుంచి ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలతో కూడిన అభివృద్ధి చెందిన స్టేషన్‌గా రూపాంతరం చెందింది. అమరావతి రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలో, విజయవాడ–గుంటూరు మధ్య కీలక రైల్వే మార్గంలో ఉండటంతో ఈ స్టేషన్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మంగళగిరి రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అమరావతికి అనుసంధానంగా ఉన్న ఈ కీలక రైల్వే స్టేషన్‌ను రూ.12.56 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించారు. ఎన్‌ఎస్‌జి-4 కేటగిరీకి చెందిన ఈ రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించడంతోపాటు బుకింగ్ కార్యాలయం, వెయిటింగ్ హాల్స్, విఐపి లాంజ్‌తో కూడిన రెండో ప్రవేశ సముదాయాన్ని నిర్మించారు. రైల్వే స్టేషన్ ముఖ ద్వారం, ప్రవేశ వరండా, ప్లాట్‌ఫారాలు, ప్రయాణికుల నిరీక్షణ ప్రాంతాలు, టాయిలెట్లు, సీటింగ్ సదుపాయాలు, సూచిక బోర్డులు వంటి వాటిని నూతనంగా తీర్చిదిద్దారు. వికలాంగుల సౌకర్యార్థం రెండు లిఫ్ట్‌లు, ర్యాంపులు, ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫారాలు-1, 4లపై కొత్త షెల్టర్లు నిర్మించారు. స్టేషన్ ముందు, వెనుక భాగాల్లో ప్రత్యేక పార్కింగ్, పాదచారుల మార్గాలు, వీధి దీపాలు, విశాలమైన ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, అదనంగా విశ్రాంతి గదులు, ఆధునిక టికెట్ బుకింగ్ సదుపాయాలు, మంగళగిరి ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే కళాత్మక అలంకరణలను ఏర్పాటు చేశారు.







కామెంట్‌లు (0)