హైదరాబాద్ : భారతీయ అంతరిక్ష చరిత్రలో మరో విశిష్ట ఘట్టం నమోదైంది. 'మిషన్ ఆగమన్'లో భాగంగా పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా కేవలం ఉపగ్రహ సాంకేతికతకే కాదు, భారతీయ కళా వైభవానికీ అంతరిక్షంలో ప్రత్యేక స్థానం లభించింది. వరంగల్‌కు చెందిన అంతర్జాతీయ అతిసూక్ష్మ శిల్పకారుడు అజయ్ కుమార్ రూపొందించిన సూది రంధ్రంలోని సూక్ష్మ శిల్పాలు కూడా ఈ రాకెట్‌తో కలిసి అంతరిక్ష యాత్ర చేశాయి.
హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ద్వారా ప్రయాణించిన ఈ కళాఖండాలు భారతీయ సూక్ష్మ శిల్పకళకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చాయి. ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన భారతీయ రాకెట్‌తో ఇటువంటి కళాఖండాలు అంతరిక్షంలోకి చేరడం దేశ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.
అజయ్ కుమార్ సూది రంధ్రంలో భారతదేశపు ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలు డాక్టర్ సి.వి. రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయి, భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం ప్రతిరూపాలను అత్యంత సూక్ష్మంగా చెక్కారు. ఒక్కో శిల్పం ఎత్తు కేవలం 800 మైక్రాన్లు (0.8 మిల్లీమీటర్లు) మాత్రమే. సాధారణ కంటితో వీటిని స్పష్టంగా చూడటం సాధ్యం కాక, ప్రత్యేక మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే వీక్షించవచ్చు.
ఈ అపురూప కళాఖండాలను రూపొందించేందుకు సుమారు 140 గంటలు శ్రమించినట్లు అజయ్ కుమార్ తెలిపారు. అంతరిక్ష ప్రయాణంలో తట్టుకునేలా స్టెయిన్‌లెస్ స్టీల్, 24 క్యారెట్ల బంగారం, స్వచ్ఛమైన వెండి, సిరామిక్ పొడి, కార్బన్ ఫైబర్ చూర వంటి ప్రత్యేక పదార్థాలను వినియోగించారు. సూక్ష్మ స్థాయిలో ఖచ్చితత్వం, ఓర్పు, ఏకాగ్రతతో ఈ శిల్పాలను రూపొందించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు.
స్కైరూట్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ బృందం నిర్దేశించిన సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఈ కళాఖండాలను తయారు చేశారు. వైబ్రేషన్, అధిక ఉష్ణోగ్రతలు తదితర కఠిన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ప్రత్యేక రక్షణ పేలోడ్ హౌసింగ్‌లో అమర్చి విక్రమ్-1 రాకెట్ పేలోడ్‌లో భాగంగా అంతరిక్షంలోకి పంపించారు.
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో 'మూన్ మ్యూజియం' (1969), 'ఫాలెన్ ఆస్ట్రోనాట్' (1971) తర్వాత ప్రత్యేక కళాఖండాలకు గుర్తింపు లభించిన సందర్భాల్లో భారతదేశం నుంచి సూది రంధ్రంలో రూపొందించిన ఈ సూక్ష్మ శిల్పాలు కూడా చేరడం విశేషం. దీంతో భారతీయ సూక్ష్మ శిల్పకళకు ప్రపంచ అంతరిక్ష కళా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు లభించనుంది.
గత నాలుగు దశాబ్దాలుగా తాను అంకితభావంతో కొనసాగిస్తున్న సూక్ష్మ శిల్పకళకు ఇది అత్యున్నత గౌరవమని అజయ్ కుమార్ పేర్కొన్నారు. తన చేతులతో రూపొందించిన కళాఖండాలు అంతరిక్ష చరిత్రలో భాగం కావడం జీవితంలో మరచిపోలేని అనుభూతిగా అభివర్ణించారు. ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకులు, సీఈఓ పవన్ కుమార్ చందన, నాగ భరత్, నిఖిల్ మద్దూరి, డాక్టర్ సి.వి.ఎస్. కిరణ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.








కామెంట్‌లు (0)